యాప్నగరం

Shubman Gill కోసం భారత కెప్టెన్ త్యాగం.. చెలరేగిపోయిన ఓపెనర్

IND vs ZIM 1st ODI లో భారత ఓపెనర్ శుభమన్ గిల్ బౌండరీల మోత మోగించేశాడు. కేఎల్ రాహుల్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయడంతో గబ్బర్‌తో కలిసి ఓపెనర్‌గా ఆడిన గిల్ 72 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 18 Aug 2022, 7:43 pm

ప్రధానాంశాలు:

  • జింబాబ్వే‌పై తొలి వన్డేలో శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ
  • శిఖర్ ధావన్‌తో కలిసి 192 పరుగుల భాగస్వామ్యం
  • గిల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని రాహుల్ త్యాగం
  • మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారత్ గెలుపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Shubman Gill (Pic Source: Twitter)
శుభమన్ గిల్ (Pic Source: Twitter)
ఆసియా కప్ 2022కి ఓపెనర్‌గా ఎంపికైన కేఎల్ రాహుల్‌కి జింబాబ్వే పర్యటనలో ఫామ్ అందుకోవడం ఇప్పుడు చాలా అవసరం. భారత సెలెక్టర్లు కూడా రాహుల్‌కి మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించేందుకే జింబాబ్వే పర్యటనకి ఎంపిక చేశారు. వాస్తవానికి మొదట జింబాబ్వే టూర్‌కి ప్రకటించిన భారత వన్డే జట్టులో కేఎల్ రాహుల్ లేడు. శిఖర్ ధావన్‌ కెప్టెన్సీలో తొలుత జట్టుని భారత సెలెక్టర్లు ప్రకటించారు. కానీ.. టూర్‌కి టీమ్‌ బయల్దేరే కొన్ని గంటల ముందు రాహుల్‌ని జట్టులోకి ఎంపిక చేసి.. అతనికే కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించారు.
భారత్, జింబాబ్వే మధ్య గురువారం హరారే వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగగా.. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడతాడని అంతా ఊహించారు. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే టీమ్ 189 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనకి ఓపెనర్‌ శిఖర్ ధావన్‌తో కలిసి శుభమన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. దాంతో అంతా ఆశ్చర్యపోయారు. ఐపీఎల్ 2022 తర్వాత ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేకపోయిన కేఎల్ రాహుల్‌‌కి ఆసియా కప్‌‌కి ముందు కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడే అవకాశం ఉండగా.. ఫస్ట్ ఛాన్స్‌ని గిల్‌కి ఇచ్చేశాడు. ఇక రెండు వన్డేల్లో మాత్రమే రాహుల్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

కేఎల్ రాహుల్ త్యాగం వృథా కాలేదు. 190 పరుగుల ఛేదనలో దూకుడుగా ఆడేసిన శుభమన్ గిల్ కేవలం 72 బంతుల్లోనే 10x4, 1x6 సాయంతో అజేయంగా 82 పరుగులు చేశాడు. అలానే శిఖర్ ధావన్ (81 నాటౌట్: 113 బంతుల్లో 9x4)తో కలిసి తొలి వికెట్‌కి అజేయంగా 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లోనూ శుభమన్ గిల్ ఓపెనర్‌గా అదరగొట్టేశాడు. ఆ సిరీస్‌లో 82*(72 బంతుల్లో), 98*(98 బంతుల్లో), 43(49 బంతుల్లో) పరుగులు చేశాడు. దాంతో అతని లయని దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో రాహుల్ అతనికే తొలి వన్డేలో ఓపెనర్‌గా ఛాన్సిచ్చినట్లు తెలుస్తోంది.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.