యాప్నగరం

Sydney Test: భంగపడిన సిడ్నీలోనే మళ్లీ కాలరెగరేసిన పుజారా..!

నాలుగేళ్ల క్రితం ఇలానే సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు మ్యాచ్ జరగగా.. నెమ్మదిగా ఆడుతున్నాడనే కారణం చూపుతూ అతడిపై టీమిండియా మేనేజ్‌మెంట్ వేటు వేసింది.

Samayam Telugu 4 Jan 2019, 9:26 am
ఆస్ట్రేలియా గడ్డపై భంగపడిన చోటే భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో సత్తాచాటాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా (193: 373 బంతుల్లో 22x4) భారీ శతకం బాదడంతో.. ఓవర్‌నైట్ స్కోరు 303/4తో ఈరోజు తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు 429/6తో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
Samayam Telugu 200


నాలుగేళ్ల క్రితం ఇలానే సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు మ్యాచ్ జరగగా.. నెమ్మదిగా ఆడుతున్నాడనే కారణం చూపుతూ అతడిపై టీమిండియా మేనేజ్‌మెంట్ వేటు వేసింది. అప్పట్లో నాలుగో టెస్టుకి ముందు జరిగిన మూడు టెస్టుల్లోనూ 33.2 సగటుతో పుజారా 201 పరుగులే చేశాడు. దీంతో.. అతడ్ని ఆఖరి టెస్టుకి పక్కన పెట్టింది.

కానీ.. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో అతనే టీమిండియాకి ఆపద్బాంధవుడయ్యాడు. ఇప్పటికే అడిలైడ్, మెల్‌బోర్న్ టెస్టులో శతకాలు సాధించి భారత్‌ విజయంలో క్రియాశీలక పాత్ర పోషించిన పుజారా.. సిడ్నీలోనూ గెలిపించదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. నిన్న విరాట్ కోహ్లీ (23), అజింక్య రహానె (18), లోకేశ్ రాహుల్ (9) పేలవంగా విఫలమైన చోట.. అనితర సాధ్యమైన ఇన్నింగ్స్‌తో అందరినోళ్లూ మూయించాడు. అయితే.. కొద్దిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నా.. అతని కెరీర్‌లో మాత్రం ఇదో బెస్ట్ ఇన్నింగ్స్‌ అనడంలో మాత్రం సందేహం లేదు..!
గురువారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే కేఎల్ రాహుల్ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా.. నిన్న మూడు సెషన్లు, ఈరోజు ఒకటన్నర సెషన్ సహనంతో బ్యాటింగ్ చేశాడు. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేసిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్.. తొలి 59 బంతుల్లో చేసిన పరుగులు 16 మాత్రమే. అయితే.. అప్పటికే పిచ్‌ని బాగా చదవేసిన పుజారా.. క్రమంగా బ్యాట్‌ని ఝళిపించాడు.
ఈ క్రమంలోనే 134 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న పుజారా.. 199 బంతుల్లో శతకం, 282 బంతుల్లో 150 పరుగుల మైలురాయిని అందుకుని డబుల్ సెంచరీకి చేరువగా వచ్చాడు. కానీ.. వ్యక్తిగత స్కోరు 193 వద్ద స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి భారీ షాట్ ఆడబోయి అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పుజారా టెస్టు కెరీర్‌లో ఇప్పటికే మూడు ద్విశతకాలు, 18 శతకాలు, 20 అర్ధశతకాలు కూడా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.