యాప్నగరం

బుమ్రా షాట్‌.. ఆసీస్ బౌలర్ తలకు గాయం.. సిరాజ్ క్రీడాస్ఫూర్తి.. ఆసీస్‌కు కంకషన్ భయం!

భారత్‌తో జరుగుతున్న రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో బుమ్రా ఆడిన స్ట్రయిట్ డ్రైవ్.. బౌలర్ కామెరాన్ గ్రీన్ తలకు బలంగా తాకింది. దీంతో అతడు మైదానాన్ని వీడాడు.

Samayam Telugu 11 Dec 2020, 4:50 pm
ఆస్ట్రేలియాను మరోసారి కంకషన్ భయం పట్టుకుంది. యువ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కంకషన్‌‌కు గురయ్యాడు. శుక్రవారం భారత్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఆడిన స్ట్రయిట్ డ్రైవ్.. గ్రీన్ తలకు తాకింది. కామెరాన్ రెండో స్పెల్ బౌలింగ్ చేస్తుండగా.. బుమ్రా బలంగా బాదడంతో బంతి వేగంగా దూసుకొచ్చింది. బాల్‌ను ఆపడానికి బౌలర్ అరచేతులను అడ్డుపెట్టినప్పటికీ.. అది తల కుడివైపు తాకింది.
Samayam Telugu Cameron-Green-Jasprit-Bumrah-Mohammed-Siraj
Image Source: twitter/Fox Cricket


బంతి బలంగా తాకడంతో కామెరాన్ కిందపడిపోగా.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మహ్మద్ సిరాజ్ బ్యాట్‌ను పక్కన పడేసి పరిగెత్తుకుంటూ అతడి దగ్గరకు వెళ్లాడు. రన్ కోసం చూసుకోకుండా.. గాయపడిన తోటి ఆటగాడికి ప్రాధాన్యం ఇచ్చిన సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
వెంటనే మైదానంలోకి చేరుకున్న మెడికల్ టీం కాసేపు అతణ్ని పరీక్షించింది. మరిన్ని పరీక్షల కోసం కామెరాన్ నడుచుకుంటూ మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో బ్యాట్స్‌మెన్ ప్యాట్రిక్ రోవేను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా నియమించారు. తర్వాతి రెండు రోజులు అతడు మ్యాచ్‌లో ఆడడని క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ డాక్టర్ పిప్ ఇంగే వెల్లడించారు.
ఇండియా-ఏతో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా యువ ఓపెనర్ విల్ పుకోవ్‌స్కీ కంకషన్‌కు లోనయ్యాడు. కార్తీక్ త్యాగి విసిరిన బౌన్సర్ అతడి హెల్మెట్‌కు తాకడంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. కంకషన్ కారణంగానే విల్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. షెఫిల్డ్ షీల్డ్ ట్రోఫీలో వరుసగా రెండు డబుల్ సెంచరీలు బాదిన విల్.. డిసెంబర్ 17న ప్రారంభం కానున్న తొలి టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్.. ఇండియా-ఏతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో.. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ శతకం బాదడంతోపాటు.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో ఆసీస్ జట్టులో అతడికి చోటు దక్కుతుందని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.