యాప్నగరం

మూడో టెస్టు తొలిరోజు భారత్‌దే హవా..!

ఇంగ్లాండ్ గడ్డపై తాజా టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు తొలిసారి పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని చెలాయించింది. రెండు టెస్టుల్లోనూ పేలవ

Samayam Telugu 18 Aug 2018, 11:13 pm
ఇంగ్లాండ్ గడ్డపై తాజా టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు తొలిసారి పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని చెలాయించింది. రెండు టెస్టుల్లోనూ పేలవ ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా.. శనివారం ఆరంభమైన మూడో టెస్టులో తొలిరోజే 307 స్కోరుతో ఇంగ్లాండ్‌‌కి ఊహించని షాకిచ్చింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (97: 152 బంతుల్లో 11x4), వైస్ కెప్టెన్ అజింక్య రహానె (81: 131 బంతుల్లో 12x4) కొద్దిలో శతకాలను చేజార్చుకున్నా.. బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో భారత్‌ని మెరుగైన స్థితిలో నిలిపారు. దీంతో.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 307/6తో నిలవగా.. క్రీజులో రిషబ్ పంత్ (22 బ్యాటింగ్: 32 బంతుల్లో 2x4, 1x6) ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లు క్రిస్‌వోక్స్ మూడు, ఆదిల్ రషీద్, స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్ తలో వికెట్ పడగొట్టారు.
Samayam Telugu Nottingham: Indian cricket captain Virat Kohli, second left, and Ajinkya Rahane...


మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అనూహ్యంగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రెండో టెస్టులో వేటుకి గురై.. మూడో టెస్టులో మురళీ విజయ్ స్థానంలో జట్టులోకి వచ్చిన శిఖర్ ధావన్ (35: 65 బంతుల్లో 7x4) దూకుడుగా ఆడి స్కోరు బోర్డుని నడిపించాడు. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ (23: 53 బంతుల్లో 4x4) కూడా నిలకడగా ఆడటంతో భారత్‌కి 59/0తో మెరుగైన ఆరంభమే లభించింది. కానీ.. ఐదు పరుగుల వ్యవధిలోనే ఓపెనర్లు ఇద్దరూ వరుసగా పెవిలియన్‌ చేరిపోగా.. తర్వాత వచ్చిన చతేశ్వర్ పుజారా (14: 31 బంతుల్లో 2x4) వైఫల్యాల పరంపరని కొనసాగించాడు. దీంతో.. భారత్ 82/3తో ఇబ్బందుల్లో పడింది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన అజింక్య రహానెతో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలుత క్రీజులో నిలదొక్కుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన ఈ జోడి.. ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించింది. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని శతకం వైపు దూసుకెళ్తుండగా.. ఇంగ్లాండ్ వారి జోరుకి బ్రేక్‌లేసింది. జట్టు స్కోరు 241 వద్ద రహానె‌ని బ్రాడ్ ఔట్ చేయగా.. 279 వద్ద విరాట్ కోహ్లీని ఆదిల్ రషీద్ బుట్టలో వేశాడు. దీంతో.. 159 పరుగుల అభేద్య భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం వచ్చిన హార్దిక్ పాండ్య (18: 58 బంతుల్లో 4x4) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోగా.. కెరీర్‌లో తొలి టెస్టు ఆడిన రిషబ్ పంత్ సిక్స్‌తో తన పరుగుల ఖాతాని తెరిచి చివరి వరకూ అదే జోరుని కొనసాగించాడు. ఆట మరో నిమిషంలో ముగుస్తుందన్న దశలో హార్దిక్ పాండ్య ఔటవగా.. తొలి రోజు ఆటని అంపైర్లు నిలిపివేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.