యాప్నగరం

సిక్స్‌తో తొలి శతకాన్ని అందుకున్న పంత్

వ్యక్తిగత స్కోరు 95 వద్ద స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ బాదిన పంత్ 100 పరుగుల మైలురాయిని అందుకోవడం అతని దూకుడుకి నిదర్శనం

Samayam Telugu 7 Dec 2022, 3:55 pm
ఇంగ్లాండ్ గడ్డపై యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ శతకంతో చెలరేగాడు. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో చివరి రోజైన మంగళవారం ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పంత్ కేవలం 117 బంతుల్లో 14x4, 3x6 సాయంతో కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. వ్యక్తిగత స్కోరు 95 వద్ద స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ బాదిన పంత్ 100 పరుగుల మైలురాయిని అందుకోవడం అతని దూకుడుకి నిదర్శనం. ఇలా టెస్టుల్లో సిక్స్‌తో తొలి సెంచరీ మార్క్‌ని అందుకున్న నాలుగో భారత్ క్రికెటర్‌గా పంత్ తాజాగా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ మాత్రమే ఉన్నారు. కెరీర్ తొలి టెస్టులోనూ సిక్స్‌తో రిషబ్ పంత్ తన పరుగుల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే.
Samayam Telugu Pant


రిషబ్ పంత్‌తో పాటు ఓపెనర్ లోకేశ్ రాహుల్ (142: 210 బంతుల్లో 19x4, 1x6) సెంచరీతో కదం తొక్కడంతో 464 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు ప్రస్తుతం 298/5తో కొనసాగుతోంది. విజయానికి ఇంకా 166 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. రిషబ్ పంత్, రాహుల్ జోడీ ఆరో వికెట్‌కి అభేద్యంగా 177 పరుగుల అజేయ భాగస్వామ్యంతో కొనసాగుతోంది. ఐదు టెస్టుల ఈ సిరీస్ ఇప్పటికే 1-3తో చేజారిన నేపథ్యంలో.. ఈ టెస్టుని కనీసం డ్రాగా ముగించాలని భారత్ జట్టు పట్టుదలతో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.