యాప్నగరం

India vs New Zealand 1st ODI: న్యూజిలాండ్ గడ్డపై భారత్ బోణి అదిరింది..!

మ్యాచ్ ఆరంభంలోనే న్యూజిలాండ్ ఓపెనర్ల వికెట్లను వరుస ఓవర్లలో పడగొట్టిన మహ్మద్ షమీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

Samayam Telugu 23 Jan 2019, 3:05 pm
ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల టెస్టు, వన్డే సిరీస్‌ని చేజిక్కించుకున్న భారత్ జట్టు.. న్యూజిలాండ్ గడ్డపైనా అదిరిపోయే బోణి అందుకుంది. నేపియర్ వేదికగా ఈరోజు కివీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (75 నాటౌట్: 103 బంతుల్లో 6x4) అజేయ అర్ధశతకం బాదడంతో 156 పరుగుల లక్ష్యాన్ని భారత్ 34.5 ఓవర్లలోనే అలవోకగా ఛేదించేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
Samayam Telugu 800


undefinedundefined

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ జట్టు.. కుల్దీప్ యాదవ్ (4/39), మహ్మద్ షమీ (3/19), చాహల్ (2/43) ధాటికి 38 ఓవర్లలోనే 157 పరుగులకే ఆలౌటవగా.. ఎండ కారణంగా అరగంట మ్యాచ్ సమయం వృథా కావడంతో మ్యాచ్‌ని 49 ఓవర్లకి కుదించిన అంపైర్లు.. భారత్ లక్ష్యాన్ని 156 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ (11: 24 బంతుల్లో 1x4) నిరాశపరిచినా.. శిఖర్ ధావన్‌తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ (45: 59 బంతుల్లో 3x4) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

undefined

తాజా విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో వన్డే శనివారం ఉదయం 7.30 గంటలకి జరగనుంది. మ్యాచ్ ఆరంభంలోనే వరుస ఓవర్లలో ఓపెనర్ల వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

undefined
undefined

న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (64: 81 బంతుల్లో 7x4) ఒక్కడే భారత్ బౌలర్లకి ఎదురునిలిచి.. సొంతగడ్డపై పరువు నిలిపే ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (5: 9 బంతుల్లో 1x4) ఔటవడంతో క్రీజులోకి వచ్చిన విలియమ్సన్ 34వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచి ఒక ఎండ్‌లో వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. కానీ.. అతను ఔట్ తర్వాత.. కివీస్ ఏ దశలోనూ కోలుకోలేక వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రో (8)‌తో పాటు రాస్ టేలర్ (24), టామ్ లాథమ్ (11) వరుసగా పెవిలియన్ చేరిపోగా.. హెన్రీ నికోలస్ (12), మిచెల్ శాంట్నర్ (14), బ్రాస్‌వెల్ (7), టిమ్ సౌథీ (9 నాటౌట్), ఫర్గూసన్ (0), ట్రెంట్ బౌల్ట్ (1) తేలిపోయారు.

ఆస్ట్రేలియా‌తో ఇటీవల ఆడిన ఆఖరి వన్డే జట్టులో కెప్టెన్ కోహ్లీ రెండు మార్పులు చేశాడు. దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజాపై వేటు వేసి వారి స్థానంలో అంబటి రాయుడు, కుల్దీప్ యాదవ్‌లను తీసుకున్నాడు.

భారత్ జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, అంబటి రాయుడు, విజయ్ శంకర్, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ

న్యూజిలాండ్ జట్టు: మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రో, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), హెన్రీ నికోలస్, మిచెల్ శాంట్నర్, డాగ్ బ్రాస్‌వెల్, టిమ్ సౌథీ, లూకీ ఫర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.