యాప్నగరం

కోహ్లి సెంచరీ: భారత్ 267/3

టీం ఇండియా తన జోరును కొనసాగిస్తోంది. మూడో టెస్టులోనూ నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది.

TNN 8 Oct 2016, 5:18 pm
టీం ఇండియా తన జోరును కొనసాగిస్తోంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో చేజిక్కుచ్చుకున్న భారత్.. ఇండోర్‌లో జరుగుతున్న మూడో టెస్టులోనూ తన నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. గత రెండు టెస్టుల్లో విఫలమైన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్లో అదరగొట్టాడు. కీలక దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లి (103 నాటౌట్) సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కోహ్లికి ఆజింక్య రహానే (79 నాటౌట్) తోడవడంతో టీం ఇండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
Samayam Telugu 3
కోహ్లి సెంచరీ: భారత్ 267/3

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్‌లను కోల్పోయింది. విజయ్ 10 పరుగులకే పెవిలియన్‌కు చేరగా, చాలా విరామం తరవాత టీంలోకి వచ్చిన గౌతం గంభీర్ (29) విఫలమయ్యాడు. క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్న పుజారా (41)ను సాంట్నర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తరవాత కోహ్లి, రహానే మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో జీతన్ పటేల్, బౌల్ట్, సాంట్నర్ చెరో ఒక వికెట్ తీశారు. రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్ తమ జోరును కొనసాగిస్తే భారీ స్కోరు ఖాయంగా కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.