యాప్నగరం

రెండో టెస్టులో.. తొలి రోజు చెరో సగం

భారత్, దక్షిణాఫ్రికా మధ్య సెంచూరియన్ వేదికగా శనివారం ఆరంభమైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఐడిన్

TNN 13 Jan 2018, 9:19 pm
భారత్, దక్షిణాఫ్రికా మధ్య సెంచూరియన్ వేదికగా శనివారం ఆరంభమైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఐడిన్ మర్‌క్రమ్ (94: 150 బంతుల్లో 15x4), హసీమ్ ఆమ్లా (82: 153 బంతుల్లో 14x4) శతక చేరువ స్కోర్లు చేయడంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న దక్షిణాఫ్రికా 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. తొలి రెండు సెషన్లలో విఫలమైన భారత బౌలర్లు.. మూడో సెషన్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి.. సఫారీ జట్టుని ఒత్తిడిలోకి నెట్టారు. అశ్విన్ మూడు వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు. చివర్లో హార్దిక్ పాండ్య రెండు తెలివైన రనౌట్లతో మ్యాచ్‌ గమనాన్ని మార్చేశాడు.
Samayam Telugu india vs south africa 2nd test day 1 at centurion india make strong comeback
రెండో టెస్టులో.. తొలి రోజు చెరో సగం


తొలి టెస్టులో విఫలమైన దక్షిణాఫ్రికా ఓపెనర్లు డీన్ ఎల్గర్ (31: 83 బంతుల్లో 4x4), ఐడిన్ మర్‌క్రమ్ ఈ టెస్టులో జట్టుకి శుభారంభమిచ్చారు. తొలి వికెట్‌కి 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడి తొలి సెషన్‌లో భారత్‌ జట్టుకి వికెట్ ఇవ్వలేదు. అయితే.. ఇన్నింగ్స్ 30వ ఓవర్‌లో అశ్విన్ వీరిని విడదీశాడు. బంతిని ముందుకు ఫుష్ చేసేందుకు ప్రయత్నిస్తూ సిల్లీ పాయింట్లో మురళీ విజయ్ చేతికి లక్కీగా ఎల్గర్ చిక్కాడు. శరీరంపైకి వచ్చిన బంతిని విజయ్ చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. అనంతరం వచ్చిన ఆమ్లాతో కలిసి మర్‌క్రమ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలోనే శతకానికి చేరువైన మర్‌క్రమ్ జట్టు స్కోరు 148 వద్ద అశ్విన్ విసిరిన బంతిని కట్ చేసే ప్రయత్నంలో కీపర్ పార్థీవ్ పటేల్‌కి చిక్కాడు. తర్వాత వచ్చిన డివిలియర్స్ (20: 48 బంతుల్లో 2x4) బౌండరీతో తన గమనాన్ని చాటినా.. జట్టు స్కోరు 199 వద్ద ఇషాంత్ శర్మ విసిరిన బంతిని వికెట్లపైకి ఆడుకుని బౌల్డయ్యాడు.

ఈ దశలో కెప్టెన్ డుప్లెసిస్ (24 బ్యాటింగ్: 77 బంతుల్లో 3x4)తో కలిసి జట్టు స్కోరు బోర్డును నడిపించే బాధ్యతని ఆమ్లా తీసుకున్నాడు. బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ శతకానికి దగ్గరవుతున్న ఆమ్లాని హార్దిక్ పాండ్య తెలివిగా రనౌట్ చేశాడు. లేని పరుగు కోసం ఆమ్లా ప్రయత్నించగా.. హార్దిక్ పాండ్య మెరుపు వేగంతో బంతిని వికెట్లపైకి విసిరి పెవిలియన్ బాట పట్టించాడు. తర్వాత వచ్చిన డికాక్ (0) తానెదుర్కొన్న తొలి బంతినే ప్లిక్ చేసే ప్రయత్నంలో స్లిప్‌లో విరాట్ కోహ్లి చేతికి చిక్కాడు. అనంతరం కొద్దిసేపటికే డుప్లెసిస్‌తో సమన్వయలోపం కారణంగా ఫిలాండర్ (0) కూడా రనౌటవడంతో తొలి రోజుని దక్షిణాఫ్రికా 269/6తో ముగించింది. ఆ జట్టు చివరి పది ఓవర్లలోనే.. మరీ ముఖ్యంగా మూడు ఓవర్ల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు చేజార్చుకోవడం విశేషం. డుప్లెసిస్‌ని కనీసం గమనించకుండా.. ఫిలాండర్ పరుగు తీస్తూ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌వైపు వెళ్లి రనౌటవడం మైదానంలో నవ్వులు పూయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.