యాప్నగరం

భారత క్రికెటర్ హార్దిక్‌ పాండ్యాకి పుత్రోత్సాహం

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా చాలా ఫాస్ట్‌గా ఫ్యామిలీ లైఫ్‌ని స్టార్ట్ చేసేశాడు. జనవరి 1న నటాషాతో నిశ్చితార్థం చేసుకున్న హార్దిక్.. మే 31న తండ్రి కాబోతున్నట్లు ప్రకటించి.. తాజాగా బాబు పుట్టినట్లు అభిమానులకి తెలియజేశాడు.

Samayam Telugu 30 Jul 2020, 7:34 pm
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రయ్యాడు. సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్‌‌తో ఈ ఏడాది జనవరి 1న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హార్దిక్ పాండ్యా.. మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. దాంతో పెళ్లి కాకుండానే తండ్రి ఏంటి..? అంటూ భారత క్రికెటర్‌పై అందరూ సెటైర్లు పేల్చారు. కానీ.. అప్పట్లో మౌనంగా ఉండిపోయిన హార్దిక్ పాండ్యా.. తాజాగా పండంటి మగబిడ్డకి నటాషా జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
Samayam Telugu Hardik pandya


నటాషాతో ప్రేమ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ‘‘నేను ఎవరో అప్పటి వరకూ నటాషాకి తెలియదు. ఒక పార్టీలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నేను టోపీ, చైన్, వాచ్‌తో కనిపించడాన్ని చూసి.. ఈ వింత మనిషి ఎవరు..? ఎక్కడ నుంచి వచ్చాడు..? అనుకుందట. అయితే.. నేను తనతో మాట్లాడిన తర్వాతే.. ఒకరి గురించి మరొకరం తెలుసుకున్నాం. ఆ వెంటనే డేటింగ్, ఎంగేజ్‌మెంట్ జరిగిపోయాయి’’ అని హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.

View this post on Instagram We are blessed with our baby boy ❤️🙏🏾 A post shared by Hardik Pandya (@hardikpandya93) on Jul 30, 2020 at 3:03am PDT

వెన్ను గాయం కారణంగా గత ఏడాది అక్టోబరు నుంచి టీమిండియాకి దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్య.. బ్రిటన్‌లో సర్జరీ చేయించుకుని ఈ ఏడాది ఫిబ్రవరికి పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించాడు. ఆ తర్వాత జరిగిన డీవై పాటిల్ టీ20 కప్‌లో పరుగులు వరద పారించిన హార్దిక్ పాండ్యాని మార్చిలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కి భారత సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఆ సిరీస్ మధ్యలోనే నిలిచిపోయింది.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరిగే సూచనలు కనిపిస్తుండగా.. ముంబయి ఇండియన్స్ తరఫున సుదీర్ఘకాలంగా హార్దిక్ మ్యాచ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో.. కనీసం నెల ముందు అంటే ఆగస్టు 20 నాటికి ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లు యూఏఈకి చేరుకోనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.