యాప్నగరం

నోటి దురుసు.. పాంటింగ్ బ్యాట్‌తో నన్ను కొట్టబోయాడు: హర్భజన్

గొడవ తర్వాత రిక్కీ పాంటింగ్ నేను విసిరే బంతిని చూసి కాకుండా.. నా పేస్‌ని చూస్తూ బ్యాటింగ్ చేసేవాడు. దాంతో.. అతడ్ని నేను ఔట్ చేయడం చాలా సులువైపోయింది. -హర్భజన్ సింగ్

Samayam Telugu 6 Jul 2020, 6:41 am
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్, భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మధ్య సుదీర్ఘకాలం కోల్డ్ వార్ నడిచింది. ఈ క్రమంలో చాలా సార్లు హర్భజన్ సింగ్‌ పైచేయి సాధించగా.. ఒకానొక దశలో సహనం కోల్పోయిన రిక్కీ పాంటింగ్‌ మైదానంలోనే బ్యాట్‌తో భజ్జీని కొట్టబోయాడు. అయితే.. ఆ తర్వాత కూడా ఈ ఆధిపత్య పోరు కొనసాగిందని చెప్పుకొచ్చిన హర్భజన్ సింగ్.. ఆస్ట్రేలియా గడ్డపైనా పాంటింగ్‌ని బోల్తా కొట్టించానని గుర్తు చేసుకున్నాడు.
Samayam Telugu Harbhajan Singh,Ricky Ponting


టెస్టుల్లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా అప్పట్లో కితాబులు అందుకున్న రిక్కీ పాంటింగ్ మొత్తంగా 168 టెస్టు మ్యాచ్‌ల్లో 51.85 సగటుతో ఏకంగా 13,378 పరుగులు చేశాడు. ఇందులో 41 సెంచరీలు కూడా ఉన్నాయి. కానీ.. హర్భజన్ సింగ్‌పై మాత్రం పాంటింగ్‌కి మెరుగైన రికార్డ్‌ లేదు. భజ్జీ బౌలింగ్‌లో 22.30 సగటుతో మాత్రమే పరుగులు రాబట్టగలిగిన పాంటింగ్.. 2001 భారత పర్యటనలో ఘోరంగా విఫలమై 5 ఇన్నింగ్స్‌ల్లో 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ఐదు ఇన్నింగ్స్‌ల్లోనూ హర్భజన్ సింగ్‌కే అతను వికెట్ సమర్పించుకోగా.. మొత్తంగా టెస్టుల్లో 10 సార్లు అతడ్ని భజ్జీ ఔట్ చేశాడు.


రిక్కీ పాంటింగ్‌తో ఆధిపత్య పోరు గురించి తాజాగా స్టార్ స్పోర్ట్స్ షో ‘క్రికెట్ కనెక్టెడ్’లో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ ‘‘పాంటింగ్‌ని తొలిసారి షార్జా వేదికగా వన్డేల్లో ఔట్ చేశాను. నా బౌలింగ్‌లో అతను స్టంపౌట్ అవగా.. పెవిలియన్‌కి వెళ్తున్న అతడ్ని ఉద్దేశించి నేను ఓ పదం అన్నాను. అప్పట్లో నాకు పెద్దగా ఇంగ్లీష్ వచ్చేది కాదు. అయితే.. కొందరి నోటి నుంచి ఆ పదం విని ఉండటంతో.. వాడేశా. అది విని కోపంతో నాపైకి పాంటింగ్‌ దూసుకొచ్చాడు. కొట్టేలా నాపైకి రావడంతో.. నిజంగానే అతను నన్ను బ్యాట్‌తో కొట్టేస్తాడేమో అనిపించింది. ఆ తర్వాత కూడా పాంటింగ్‌ని చాలాసార్లు ఔట్ చేశాను. ఆ ఘటన తర్వాత పాంటింగ్.. నేను విసిరే బంతిని కాకుండా నా పేస్‌ని చూసి బ్యాటింగ్ చేసేవాడు. దాంతో.. నా పని సులువైంది. భారత్ గడ్డపైనే కాదు.. సిడ్నీలోనూ పాంటింగ్‌ని నేను బోల్తా కొట్టించగలిగా’’ అని హర్భజన్ సింగ్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.