యాప్నగరం

రోహిత్ శర్మ ‘గోల్డెన్ డక్’.. ఓ చెత్త రికార్డ్

దక్షిణాఫ్రికా గడ్డపై పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ.. బుధవారం రాత్రి జరిగిన రెండో టీ20లోనూ

TNN 22 Feb 2018, 1:15 pm
దక్షిణాఫ్రికా గడ్డపై పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ.. బుధవారం రాత్రి జరిగిన రెండో టీ20లోనూ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సఫారీ ఫాస్ట్ బౌలర్ జూనియర్ డాలా తొలి బంతినే గుడ్ లెంగ్త్ రూపంలో విసిరాడు. కానీ పాదాల కదలికలో తన బద్ధకాన్ని మరోసారి ప్రదర్శించిన రోహిత్ శర్మ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు.
Samayam Telugu indian opener rohit sharma creates unwanted record in t20s
రోహిత్ శర్మ ‘గోల్డెన్ డక్’.. ఓ చెత్త రికార్డ్


లెగ్‌ స్టంప్‌ని లక్ష్యంగా చేసుకుని వస్తున్న బంతిని.. మిడిల్ వికెట్‌పై ఉండి ఆడటానికి రోహిత్ ప్రయత్నించాడు. దీంతో బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి ఫ్యాడ్స్‌ని తాకింది. ఔట్ కోసం దక్షిణాఫ్రికా ఫీల్డర్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తొలుత ఈ అప్పీల్‌ని తిరస్కరించాడు. కానీ.. సఫారీ కెప్టెన్ డుమిని డీఆర్‌ఎస్‌ కోరగా.. రిప్లైలో బంతి బ్యాట్‌ని తాకలేదని.. నేరుగా వెళ్లి లెగ్‌స్టంప్‌ని తాకేలా కనిపించడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని రోహిత్ శర్మని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో పరుగులేమీ చేయకుండానే గోల్డన్‌ డక్‌గా రోహిత్ శర్మ పెవిలియన్ బాట పట్టాడు. ఈ పర్యటనలోనే నాలుగో వన్డేలో రోహిత్ శర్మ శతకం బాదినా.. ఆ ఫామ్‌ని కొనసాగించలేకపోయాడు.

టీ20ల్లో ఇలా గోల్డెన్ డక్( ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్) రూపంలో రోహిత్ శర్మ ఔటవడం కెరీర్‌లో ఇది నాలుగోసారి. భారత్ తరఫున ఇప్పటి వరకు ఆశిష్ నెహ్రా, యూసఫ్ పఠాన్ మాత్రమే మూడు సార్లు గోల్డెన్ డక్ రూపంలో ఔటయ్యారు. తాజాగా రోహిత్ శర్మ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసి అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మనీశ్ పాండే (79 నాటౌట్: 48 బంతుల్లో 6x4, 2x6), మహేంద్రసింగ్ ధోని (52 నాటౌట్: 28 బంతుల్లో 4x4, 3x6) అర్ధశతకాలు బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం క్లాసెన్ (69: 30 బంతుల్లో 3x4, 7x6), కెప్టెన్ డుమిని (64: 40 బంతుల్లో 4x4, 3x6) దూకుడుగా ఆడటంతో దక్షిణాఫ్రికా 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని 189/4తో చేధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమవగా.. విజేత నిర్ణయాత్మక మూడో టీ20 శనివారం జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.