యాప్నగరం

టీ20ల్లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధ్యమే.. గణాంకాలే సాక్ష్యం: కైఫ్

వన్డేల్లో రోహిత్ శర్మ అత్యుత్తమ స్కోరు 264.. వన్డే క్రికెట్‌లో ఇప్పటికీ ఇదే బెస్ట్. మరి టీ20 ఫార్మాట్‌లోనూ ఈ తరహాలో టాప్ స్కోర్‌‌ని రోహిత్ శర్మ నమోదు చేయగలడా..? టీ20ల్లో ఇప్పటికే 4 సెంచరీలు బాదిన హిట్‌మ్యాన్.. డబుల్ సెంచరీ కోసం నిరీక్షిస్తున్నాడు.

Samayam Telugu 12 Jun 2020, 1:19 pm
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోరు 172 పరుగులు.. ఈ రికార్డ్ ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ పేరిట ఉంది. ఇక ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా 175 పరుగులతో వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ కొనసాగుతున్నాడు. ఈ రికార్డులని బట్టి చూస్తే..? టీ20ల్లో డబుల్ సెంచరీని కూడా మనం త్వరలోనే చూడబోతున్నాం అని అర్థమవుతోంది. అయితే.. టీ20ల్లో ఫస్ట్ డబుల్ సెంచరీని అందుకోగల సామర్థ్యం ఉన్న క్రికెటర్ ఎవరు..? అంటే చాలా మంది నోటి నుంచి వినిపించే పేరు రోహిత్ శర్మ. మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా హిట్‌మ్యాన్‌కే ఓటేశాడు. ఇప్పటి వరకూ 108 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ.. 138.79 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 2,773 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 118.
Samayam Telugu Rohit Sharma
Rohit Sharma. (Getty Images)


భారత అండర్-19 టీమ్ మాజీ కెప్టెన్ ప్రియమ్ గార్గె‌తో ఇటీవల హలో యాప్‌ ద్వారా మహ్మద్ కైఫ్ మాట్లాడుతుండగా.. టీ20ల్లో డబుల్ సెంచరీ గురించి చర్చ వచ్చింది. దాంతో.. రోహిత్ శర్మకి ఆ మైలురాయిని అందుకునే సామర్థ్యం ఉందని కితాబిచ్చిన కైఫ్.. టీ20ల్లో సెంచరీ తర్వాత రోహిత్ శర్మ స్ట్రైక్‌రేట్‌ పతాక స్థాయిలో ఉంటోందని గుర్తుచేశాడు. వన్డేల్లో ఇప్పటికే రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే.

‘‘టీ20ల్లో డబుల్ సెంచరీ సాధించగల సామర్థ్యం రోహిత్ శర్మకి ఉంది. ఎందుకంటే.. అతని స్ట్రైక్‌రేట్ మ్యాచ్ జరిగేకొద్దీ క్రమంగా పెరుగుతూ పోతుంది. కొన్నిసార్లు అతను నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించినా.. శతకం తర్వాత మాత్రం అతని స్ట్రైక్‌రేట్ 250-300 మధ్యలో ఉంటుంది. కాబట్టి.. రోహిత్ కచ్చితంగా డబుల్ సెంచరీ మైలురాయిని అందుకోగలడు. నేను క్రికెట్ ఆడే రోజుల్లో టీమ్ 200-250 పరుగులు చేయడమే కష్టంగా ఉండేది. కానీ.. ఇప్పుడు 400-500 స్కోర్లు గురించి మాట్లాడుకుంటున్నారు’’ అని కైఫ్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.