యాప్నగరం

ధావన్‌ను కవ్వించిన రబాడాపై జరిమానా..!

భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కవ్వించిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్‌ రబాడాపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

TNN 14 Feb 2018, 7:26 pm
భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కవ్వించిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్‌ రబాడాపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పోర్ట్‌ఎలిజబెత్ వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన ఐదో వన్డేలో తన బౌలింగ్‌లో ఔటై పెవిలియన్‌కి వెళ్తున్న శిఖర్ ధావన్‌ని ఉద్దేశించి రబాడ కవ్వింపులకి దిగాడు. అయితే.. వాటిని పట్టించుకోకుండా నేరుగా ధావన్ పెవిలియన్‌కి వెళ్లిపోగా.. మైదానంలో క్రమశిక్షణ తప్పిన రబాడాకి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ జరిమానాతో పాటు రబాడ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేరింది.
Samayam Telugu kagiso rabada fined for shikhar dhawan send off
ధావన్‌ను కవ్వించిన రబాడాపై జరిమానా..!


ఈ మ్యాచ్‌లోనే రబాడ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ వరుసగా రెండు ఫోర్లు బాదగా.. సహనం కోల్పోయిన సఫారీ బౌలర్ మైదానంలోనే నోటికి పనిచెప్పాడు. ఈ క్రమంలోనే అతను విసిరిన షార్ట్ పిచ్ బంతిని హిట్ చేసిన ధావన్.. బౌండరీ లైన్‌కి సమీపంలో ఫీల్డర్ ఆండిల్ చేతికి చిక్కాడు. దీంతో.. మితిమీరిన సంబరాలు చేసుకున్న రబాడ.. క్రమశిక్షణ తప్పి.. అభ్యంతరకరరీతిలో ధావన్‌కి సైగలు చేశాడు.

తాజా డీమెరిట్ పాయింట్‌తో రబాడ ఖాతాలో మొత్తం ఐదు పాయింట్లు జమయ్యాయి. 24 నెలల వ్యవధిలో మరో మూడు పాయింట్లు జమైతే.. అతనిపై ఒక టెస్టు, రెండు వన్డేలు లేదా నాలుగు వన్డేలు సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో రబాడ తన ప్రవర్తనతో మూడు డీమెరిట్ పాయింట్లు ఖాతాలో వేసుకోగా.. జులై 2017 ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో గొడవ కారణంగా మరో పాయింట్ అతని ఖాతాలో చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.