యాప్నగరం

భారత పర్యటనకు విలీయమ్సన్ దూరం.. పాకిస్థాన్ టూర్‌కి వచ్చి అట్నుంచి అటే వెనక్కి

2023 జనవరిలో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. భారత గడ్డ మీద మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. కాగా ఈ సిరీస్‌కు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ దూరంగా ఉండనున్నారు. దీంతో టామ్ లాథమ్ కిివీస్ జట్టును ముందుకు నడిపించనున్నాడు. విలియమ్సన్ స్థానంలో చాప్‌మన్‌ను ఆడించనున్నారు. సౌథీ బదులు జాకబ్ డఫే భారత్‌లో పర్యటించనున్నాడు. ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఉండటంతో కేన్, సౌథీ విశ్రాంతి తీసుకోనున్నారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 19 Dec 2022, 2:11 pm

ప్రధానాంశాలు:

  • భారత్‌లో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనున్నకివీస్
  • ఈ పర్యటనకు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ దూరం
  • న్యూజిలాండ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న టామ్ లాథమ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kane Williamson
Kane Williamson
డిసెంబర్ 26 నుంచి పాకిస్థాన్ గడ్డ మీద రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ఆడనున్న న్యూజిలాండ్ జట్టు.. ఆ పర్యటన ముగియగానే భారత్‌లో పర్యటించనుంది. టీమిండియాతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. పాకిస్థాన్ పర్యటనలో కివీస్ జట్టు తరఫున భాగం కానున్న కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ భారత పర్యటనకు మాత్రం దూరంగా ఉండనున్నారు. వారితోపాటు కోచ్ గ్యారీ స్టీడ్ సైతం ఈ టూర్‌కు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని బ్లాక్ క్యాప్స్ సెలక్టర్ గవిన్ లార్సెన్ సోమవారం ధ్రువీకరించారు. ఫిబ్రవరి నెలలో ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉండటంతో.. శారీరకంగా, మానసికంగా రీఛార్జ్ కావడం కోసం కీలక ఆటగాళ్లయిన విలియమ్సన్, సౌథీలకు విశ్రాంతి కల్పించామని లారెన్స్ తెలిపాడు.
గత వారమే కేన్ విలియమ్సన్ టెస్ట్ కెప్టెన్సీని వదిలేసిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో సౌథీకి కివీస్ నాయకత్వ పగ్గాలు అప్పగించారు. కానీ వన్డేలు, టీ20ల్లో కేన్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.

17 మంది సభ్యులతో కూడిన న్యూజిలాండ్ వన్డే జట్టు జనవరి 10-14 మధ్య పాకిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తర్వాత జనవరి 18-24 మధ్య భారత్‌తో వన్డే సిరీస్ ఆడనుంది.

కేన్ విలియమ్సన్ స్థానంలో మార్క్ చాప్‌మన్, సౌథీ స్థానంలో జాకబ్ డఫే భారత పర్యటనకు రానున్నారు. కివీస్ జట్టు కెప్టెన్‌గా టామ్ లాథమ్ వ్యవహరించనున్నాడు.

ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొనడం కోసం ట్రెంట్ బౌల్ట్, ఆల్‌రౌండర్ జిమ్మీ నీషామ్ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి నిరాకరించడంతో భారత పర్యటన కోసం వారిని ఎంపిక చేయలేదు. వెన్ను గాయం కారణంగా బౌలర్ కైల్ జెమీసన్ ఇండియా టూర్‌కు దూరమయ్యాడు.

వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో తమకు భారత్‌తో వన్డే సిరీస్ ఎంతో ముఖ్యమని లార్సెన్ వ్యాఖ్యానించాడు.

పాకిస్థాన్, భారత్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్, పాకిస్థాన్ టూర్‌కు మాత్రమే), ఫిన్ అలెన్, మైకెల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్‌మన్ (ఇండియా టూర్ మాత్రమే), డెవాన్ కాన్వే, జాకబ్ డఫే (భారత పర్యటనకు మాత్రమే), లాకీ ఫెర్గ్యుసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (భారత్‌పై కెప్టెన్), ఆడమ్ మిల్నే, డారెల్ మిచెల్, హెన్రీ నికోలస్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, హెన్రీ షిప్లే, ఇష్ సోధీ, టిమ్ సౌథీ (పాకిస్థాన్ పర్యటనకు మాత్రమే).

Read More Sports News And Telugu news
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.