యాప్నగరం

NZ vs WI: విలియమ్సన్ డబుల్ సెంచరీ.. మరో 4 రన్స్ చేసి ఉండుంటే?

వెస్టిండీస్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో కిివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 251 రన్స్ చేసిన విలియమ్సన్‌కు కెరీర్లో ఇది మూడో ద్విశతకం కావడం గమనార్హం.

Samayam Telugu 4 Dec 2020, 9:11 am
హమిల్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 97 పరుగులతో క్రీజ్‌లో ఉన్న విలియమ్సన్.. 369 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 251 పరుగులు చేసిన కేన్‌కు టెస్టుల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. విలియమ్సన్ ద్విశతకం నమోదు చేయడంతో 7 వికెట్ల నష్టానికి 517 పరుగుల వద్ద కివీస్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
Samayam Telugu kane williamson
Image: Twitter/SunRisers


ద్విశతకం పూర్తయ్యాక దూకుడు పెంచిన కేన్.. కెమర్ రోచ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు ఓ సిక్స్ బాది తర్వాతి బంతికి ఔటయ్యాడు. కానీ రోచ్ క్రీజ్ అవతల పాదం మోపి బాల్ విసరడంతో.. అంపైర్ నో బాల్‌గా ప్రకటించారు. టీ బ్రేక్ తర్వాత అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో ఓ ఫోర్, సిక్స్ బాదిన విలియమ్సన్ 251 పరుగుల వద్ద తర్వాతి బంతికి రోస్టన్ ఛేజ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరి 50 పరుగులను కేన్ 41 బంతుల్లోనే చేయడం విశేషం. జెమీసన్ హాఫ్ సెంచరీ చేయగానే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

విలియమ్సన్‌కు టెస్టుల్లో ఇది మూడో డబుల్ సెంచరీ కాగా.. చివరిసారిగా 2019లో హమిల్టన్‌లోనే ద్విశతకం నమోదు చేయడం విశేషం. న్యూజిలాండ్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రెండన్ మెక్‌కల్లమ్ (4) తొలి స్థానంలో ఉండగా.. 3 ద్విశతకాలతో విలియమ్సన్, ఫ్లెమింగ్, టేలర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

పచ్చికతో ఉన్న పిచ్ మీద.. విండీస్ బౌలర్లను ఎదుర్కొంటూ కేన్ బ్యాటింగ్ చేస్తున్న తీరుపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత తరం క్రికెటర్లలో కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్‌లను ఫ్యాబ్-4గా పిలుస్తారు. వీరిలో కోహ్లి, రూట్‌లకు టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 254 పరుగులు కాగా.. విండీస్‌పై 251 రన్స్ చేసిన విలియమ్సన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 239 పరుగులతో స్మిత్ ఈ నలుగురిలో చివరి స్థానంలో ఉన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.