యాప్నగరం

ఓవర్‌లోనే 22 పరుగులిచ్చా.. కోహ్లి వచ్చేశాడు..!

ఇంగ్లాండ్‌తో ఆదివారం రాత్రి ముగిసిన మూడో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్ ప్రదర్శనతో భారత జట్టు విజయంలో క్రియాశీలకంగా

Samayam Telugu 9 Jul 2018, 1:52 pm
ఇంగ్లాండ్‌తో ఆదివారం రాత్రి ముగిసిన మూడో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్ ప్రదర్శనతో భారత జట్టు విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. తొలుత బంతితో 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన హార్దిక్.. ఆ తర్వాత బ్యాట్‌తోనూ 14 బంతుల్లో 4x4, 2x6 సాయంతో అజేయంగా 33 పరుగులు చేశాడు. దీంతో.. మ్యాచ్‌లో అలవోక విజయాన్ని అందుకున్న భారత్ మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుంది.
Samayam Telugu 00


మ్యాచ్‌లో తానేసిన తొలి ఓవర్‌ (ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌)‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ చెలరేగడంతో హార్దిక్ పాండ్య ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్‌లో తొలి నాలుగు బంతుల్ని రాయ్ 4, 4, 6, 6గా మలిచేశాడు. ఆఖరి రెండు బంతులకీ రెండు సింగిల్స్ వచ్చాయి. దీంతో.. మళ్లీ 12వ ఓవర్‌ వరకూ హార్దిక్‌ చేతికి కోహ్లి బౌలింగ్‌ కోసం బంతినిచ్చే సాహసం చేయలేదు. కానీ.. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో మళ్లీ అవకాశం దక్కగానే.. హార్దిక్ క్రమశిక్షణతో బౌలింగ్ చేసి లయ అందుకున్నాడు. ఆ ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే ఇచ్చిన ఈ ఆల్‌రౌండర్ అనంతరం 14వ ఓవర్‌లో 8 పరుగులిచ్చి ఇయాన్ మోర్గాన్, అలెక్స్ హేల్స్ వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 18వ ఓవర్‌లోనూ 6 పరుగులు మాత్రమే ఇచ్చి బెన్‌స్టోక్స్, జానీ బారిస్టోని పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో.. ఒకానొక దశలో 225-230 పరుగులు చేసేలా కనిపించిన ఇంగ్లాండ్ 198/9కే పరిమితమైంది.

‘మ్యాచ్‌లో నేను వేసిన తొలి ఓవర్‌లోనే 22 పరుగులిచ్చాను. దీంతో.. మళ్లీ బౌలింగ్ అవకాశం రాగానే.. అత్యుత్తమంగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నా. ఆ ఓవర్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి పరామర్శ ధోరణిలో నా వద్దకు వచ్చాడు. నేను ఏం ఫర్వాలేదు అని చెప్పా. ఇలాంటి పిచ్‌లపై వికెట్లు తీయడం మొదలుపెడితే.. ఆటోమేటిక్‌గా పరుగుల ప్రవాహం తగ్గుతుందని నాకు తెలుసు. అందుకే ఆ ప్లాన్‌తో ముందుకెళ్లా. ప్రతి మ్యాచ్‌లోనూ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటా’ అని హార్దిక్ పాండ్య వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.