యాప్నగరం

వెస్టిండీస్‌తో గెలుపు లెక్క సరిచేసిన ఇంగ్లాండ్.. సిరీస్ సమం

తొలి టెస్టులో ఊహించని ఓటమితో కంగుతిన్న ఇంగ్లాండ్ టీమ్.. రెండో టెస్టులో అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటి టీమ్‌కి ఒంటిచేత్తో విజయాన్ని అందించిన బెన్‌స్టోక్స్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Samayam Telugu 21 Jul 2020, 6:54 am
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో గెలుపు లెక్కని ఇంగ్లాండ్ సరిచేసింది. మాంచెస్టర్ వేదికగా భారత కాలమాన ప్రకారం సోమవారం అర్ధరాత్రి ముగిసిన రెండో టెస్టులో అసాధారణ పోరాట పటిమని కనబర్చిన ఇంగ్లాండ్ టీమ్ 113 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ని ఓడించింది. 312 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 198 పరుగులకే ఆలౌటవగా.. మూడు టెస్టుల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమైంది. ఇక విజేత నిర్ణయాత్మక ఆఖరి టెస్టు మ్యాచ్‌ మాంచెస్టర్ వేదికగానే శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది.
Samayam Telugu Second Test - England v West Indies


గురువారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్.. వైస్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ (176: 356 బంతుల్లో 17x4, 2x6), ఓపెనర్ డొమినిక్ సిబ్లే (120: 372 బంతుల్లో 5x4) శతకాలు బాదడంతో మొదటి ఇన్నింగ్స్‌ని 469/9తో డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 287 పరుగులకి ఆలౌటవగా.. ఇంగ్లాండ్‌కి 182 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ బెన్‌స్టోక్స్ (78 నాటౌట్: 57 బంతుల్లో 4x4) ఓపెనర్‌గా వచ్చి మరీ మెరుపు ఇన్నింగ్స్ ఆడేశాడు. దాంతో.. రెండో ఇన్నింగ్స్‌ని 129/3తో డిక్లేర్‌ చేసిన ఇంగ్లాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 182 పరుగులతో కలుపుకుని మొత్తం 312 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్ల ముందు ఉంచింది.

భారీ లక్ష్య ఛేదనని దూకుడుగా ఆరంభించబోయిన వెస్టిండీస్.. వరుసగా వికెట్లు చేజారడంతో ఆఖర్లో డిఫెన్స్ మంత్రాన్ని జపించింది. కానీ.. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఓపెనర్ క్రైగ్ బ్రాత్‌వైట్ (12), క్యాంప్‌బెల్ (4), షైహోప్ (7), రోస్టన్ ఛేజ్ (6), డార్విచ్ (0) తక్కువ స్కోరుకే ఔటవగా.. బ్రూక్స్ (62: 136 బంతుల్లో 4x4, 2x6), బ్లాక్‌వుడ్ (55: 88 బంతుల్లో 7x4), జేసన్ హోల్డర్ (35: 62 బంతుల్లో 5x4,1x6) ఆ జట్టుని ఓటమిని నుంచి రక్షించే ప్రయత్నం చేశారు. కానీ.. ఇంగ్లాండ్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్ (3/42), బెన్‌స్టోక్స్ (2/30), క్రిస్‌వోక్స్ (2/34) డొమినిక్ బెస్ (2/59) వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. మొత్తంగా.. 70.1 ఓవర్లలో 198 పరుగులకి వెస్టిండీస్ ఆలౌటవగా.. ఇంకా 15 ఓవర్ల ఆట మిగిలిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.