యాప్నగరం

నాన్న చనిపోయినా అమ్మ రావద్దంది.. సిరాజ్ భావోద్వేగం

క్రికెటర్ సిరాజ్ తండ్రి అనారోగ్యం కారణంగా ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. నాన్న కల నెరవేర్చడం కోసం ఆస్ట్రేలియాలోనే ఉండిపోమని అమ్మ చెప్పిందని సిరాజ్ తెలిపాడు.

Samayam Telugu 24 Nov 2020, 7:47 am
హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సిరాజ్ తండ్రి అంత్యక్రియలకు దూరమయ్యాడు. నాన్న చివరి చూపు కోసం హైదరాబాద్ తిరిగి రావాలనుకున్నప్పటికీ.. అమ్మ వారించిందని సిరాజ్ తెలిపాడు. తాను దేశం తరఫున ఆడాలన్న తండ్రి కలను నెరవేర్చడం కోసం ఆస్ట్రేలియాలోనే ఉండిపోమని అమ్మ చెప్పిందన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన సిరాజ్.. దేశం తరఫున తాను బాగా ఆడాలనేది తన తండ్రి కలని తెలిపాడు.
Samayam Telugu mohammed siraj
Image: Wikipedia


సిరాజ్ స్వదేశానికి వెళ్లేందుకు ఆప్షన్ ఇచ్చామని.. కానీ ఈ పేసర్ భారత జట్టుతో ఉండాలని నిర్ణయించుకున్నాడని బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

‘‘నాన్న నాకెంతో మద్దతుగా నిలిచేవాడు. నాన్నను కోల్పోవడం నాకు తీరని లోటు. నేను భారత్‌కు ఆడుతుంటే చూడాలని నాన్న కోరుకునేవాడు. ఆయన కలను నెరవేర్చడంపైనే నా ధ్యాస ఉంది. నాన్న భౌతికంగా ఈ లోకంలో లేడు కానీ ఆయనెప్పుడూ నాతోపాటే ఉంటాడు’’ అని బీసీసీఐ వీడియో ఇంటర్వ్యూలో సిరాజ్ తెలిపాడు.

‘‘నాన్న కలలను అమ్మ గుర్తు చేసింది. ఆస్ట్రేలియాలోనే ఉండి.. దేశం తరఫున బాగా ఆడి నాన్న కల నెరవేర్చమని చెప్పింది’’ అని సిరాజ్ వెల్లడించాడు. సిడ్నీలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన తర్వాత సిరాజ్‌కు తండ్రి చనిపోయాడని తెలిసింది. ఆ సమయంలో కెప్టెన్ కోహ్లితోపాటు ఇతర క్రికెటర్లు తనకు అండగా నిలిచారని.. ధైర్యం నూరిపోశారని సిరాజ్ తెలిపాడు. ‘ధైర్యంగా ఉండు.. నాన్న కలలను నెరవేర్చడంపై ఫోకస్ పెట్టు.. టెన్షన్ పడొద్దు. ఈ పరిస్థితుల్లో నువ్వు ధైర్యంగా ఉండటం.. నీకే కాదు కుటుంబానికి కూడా ఎంతో అవసరం’ అని కోహ్లి చెప్పాడని హైదరాబాదీ పేస్ బౌలర్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.