యాప్నగరం

Impactful Captain: ధోనీ చేతిలో సర్వేలో 0.4 తేడాతో ఓడిన గంగూలీ

సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ.. ఇద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు..? సుదీర్ఘకాలంగా జరుగుతున్న చర్చ ఇది. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. కానీ.. తాజాగా ఓ సర్వే ధోనీనే బెస్ట్ అని తేల్చేసింది.

Samayam Telugu 14 Jul 2020, 5:50 am
టీమిండియాకి దూకుడు నేర్పిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒకవైపు.. భారత్‌కి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన నాయకుడు మహేంద్రసింగ్ ధోనీ మరోవైపు.. ఈ ఇద్దరిలో ప్రభావవంతమైన కెప్టెన్ ఎవరు..? ఈ ప్రశ్నకి మాజీ క్రికెటర్లు లేదా క్రికెట్ అభిమానులు స్పష్టమైన సమాధానం చెప్పడం కష్టం. అందుకే.. స్టార్‌ స్పోర్ట్స్ ఓ సర్వే నిర్వహించింది. టెస్టుల్లో ఇద్దరి కెప్టెన్సీ స్వదేశీ, విదేశీ రికార్డులు, వన్డేల్లో వారు సాధించిన ఘనతలు, కెప్టెన్‌గా ఉన్న సమయంలో వారు చేసిన పరుగులు, మొత్తంగా టీమ్‌పై వారి కెప్టెన్సీ ప్రభావం తదితర అంశాల్ని పరిగణలోకి తీసుకుని ఈ సర్వేని నిర్వహించింది. ఇందులో సౌరవ్ గంగూలీపై 0.4 తేడాతో ధోనీ విజయం సాధించాడు.
Samayam Telugu MS Dhoni, Sourav Ganguly


భారత్ గడ్డపై 21 టెస్టులకి కెప్టెన్సీ వహించిన గంగూలీ 47.6 శాతం విజయాల్ని అందుకోగా.. ధోనీ 30 టెస్టుల్లో 70 శాతం గెలుపు రికార్డ్‌‌ని సొంతం చేసుకున్నాడు. ఇక విదేశాల్లో 29 టెస్టులకిగానూ గంగూలీ 39 శాతం, 30 టెస్టుల్లో కేవలం 20 శాతం మాత్రమే గెలుపు రికార్డ్‌ని ధోనీ నమోదు చేశారు. వన్డేలపరంగా చూసుకుంటే మొత్తంగా 146 మ్యాచ్‌లకి కెప్టెన్సీ వహించిన గంగూలీ 76 మ్యాచ్‌ల్లో టీమ్‌ని గెలిపించాడు. మరోవైపు ధోనీ 200 మ్యాచ్‌లకిగానూ 110 మ్యాచ్‌ల్లో విజయాల్ని అందించాడు. కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఒక బ్యాట్స్‌మెన్‌గానూ గంగూలీపై ధోనీదే పైచేయిగా కనిపిస్తోంది. గంగూలీ 49 టెస్టుల్లో 37.66 సగటుతో 2,561 పరుగులు చేయగా.. ధోనీ 60 టెస్టుల్లో 40.66 సగటుతో 3,454 పరుగులు చేశాడు. అలానే 142 వన్డేల్లో గంగూలీ 38.79 సగటుతో 5,082 పరుగులు చేయగా.. ధోనీ 172 వన్డేల్లో 53.55 సగటుతో 6,641 పరుగులు చేశాడు.

సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు పాల్గొనగా.. జ్యూరీలో జర్నలిస్ట్‌లు, మాజీ క్రికెటర్లు, బ్రాడ్‌కాస్టర్స్‌‌కి అవకాశం కల్పించారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుని మెరుగ్గా తీర్చిదిద్దడం.. ఆ తర్వాత అదే బెస్ట్ టీమ్‌ని తర్వాత కెప్టెన్‌కి అప్పగించడంలో గంగూలీకి మంచి మార్కులు పడగా.. ఐసీసీ వరల్డ్‌‌కప్‌లు గెలవడం, కెప్టెన్‌గా ఉన్న సమయంలో మెరుగ్గా బ్యాటింగ్ చేయడం ధోనీకి కలిసొచ్చింది. మొత్తంగా.. కొద్ది తేడాతో గంగూలీపై ధోనీ పైచేయి సాధించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.