యాప్నగరం

కుర్రాడైనా కెప్టెన్‌గా ధోనీ.. కారణమిదే!

జట్టులో సీనియర్లు ఉన్నప్పటికీ.. 2007లో తనకు టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు కట్టబెట్టడానికి కారణమేంటో ధోనీ వెల్లడించాడు.

TNN 17 Nov 2017, 11:57 am
భారత క్రికెట్ జట్టుకు తిరుగులేని విజయాలు అందించిన గొప్ప కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఐసీసీ ట్రోఫీలన్నీ గెలిచిన ఏకైక కెప్టెన్‌ కూడా ధోనీనే. జట్టు పగ్గాలు చేపట్టిన అనతి కాలంలోనే.. ఏ మాత్రం అంచనాల్లేకుండా తొలి టీ20 వరల్డ్ కప్‌ను భారత్‌కు అందించాడు. సీనియర్లు ఒక్కొక్కరుగా జట్టును వీడినప్పటికీ.. ఆ ప్రభావం జట్టుపై పడకుండా సంధి కాలంలో టీమిండియాను ముందుకు నడిపించాడు.
Samayam Telugu ms dhoni explains despite being young why he was chosen to lead team india in 2007 world t20
కుర్రాడైనా కెప్టెన్‌గా ధోనీ.. కారణమిదే!


ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్‌గా తన పని తాను చేసుకుపోయే ధోనీ.. వికెట్ల వెనుక నుంచి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు రచించడంలో దిట్ట. కెరీర్ ఆరంభించిన తొలి నాళ్లలో హెలికాప్టర్ షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడిన ధోనీ కెప్టెన్సీ దక్కుతుందని మొదట్లో ఎవరూ అనుకోలేదు. మిగతా ఆటగాళ్లకు తనకంటే ఎక్కువ అనుభవం ఉన్నప్పటికీ.. 2007లో మహీకి కెప్టెన్సీ కట్టబెట్టారు. తనను కెప్టెన్‌గా ఎందుకు నియమించారనే విషయాన్ని ధోనీ ఇటీవల బయటపెట్టాడు.

జట్టుకు కొత్త కెప్టెన్ కోసం జరిపిన చర్చల్లో వాస్తవానికి ధోనీకి ఎలాంటి ప్రమేయం లేదట. నిజాయతీగా ఉండటం, అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించడం, ఆటను అర్థం చేసుకునే సామర్థ్యం వల్లే తనకు కెప్టెన్సీ లభించి ఉండొచ్చని ధోనీ అభిప్రాయపడ్డాడు.

‘ఆటను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. జట్టులో నేను యువకుణ్నే అయినప్పటికీ.. ఆ సమయంలో సీనియర్లు నా అభిప్రాయం అడిగితే.. ఎలాంటి సంకోచం లేకుండా ఆట గురించి నా ఫీలింగ్స్ షేర్ చేసుకునే వాణ్ని. టీంలోని ఇతర సభ్యులతోనూ నేను కలిసిపోయేవాణ్ని’ అని ధోనీ తెలిపాడు. ఈ కారణాల వల్లే మహేంద్ర సింగ్ ధోనీ ఎవరూ ఊహించని రీతిలో కెప్టెన్ అయ్యాడు. జట్టుకు చక్కటి విజయాలు అందించాడు. టెస్టుల్లో టీమిండియాను నంబర్ 1గా నిలిపాడు.

ధోనీ నాయకత్వంలో భారత జట్టు 199 వన్డేలు ఆడగా.. 110 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ధోనీ 60 టెస్టుల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ తర్వాత బ్యాట్‌తోనూ విజయవంతమైన కెప్టెన్ ధోనీ మాత్రమే. కెప్టెన్‌గా డివిలియర్స్ 87 వన్డేల్లో 4219 పరుగులు చేయగా, ధోనీ 199 వన్డేల్లో 6633 రన్స్ చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.