యాప్నగరం

భారత క్రికెట్ చరిత్రలో ఆ సిక్స్‌కి ప్రత్యేక స్థానం : గంగూలీ

1983లో కపిల్‌దేవ్ సారథ్యంలో భారత్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్‌ని గెలిచింది. ఆ తర్వాత 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. 2003 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కి చేరినా.. ఒత్తిడి జయించలేక ఆస్ట్రేలియా చేతిలో ఓటమి. కానీ.. 2011లో అసాధారణంగా పోరాడిన ధోనీ.. భారత్‌‌కి తన స్టయిల్‌లో కప్ అందించాడు.

Samayam Telugu 15 Jun 2020, 7:02 am
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మహేంద్రసింగ్ ధోనీ కొట్టిన ఫినిషింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ నువాన్ కులశేఖర విసిరిన బంతిని కళ్లుచెదిరే రీతిలో స్టాండ్స్‌లోకి తరలించిన ధోనీ.. 28 ఏళ్ల తర్వాత భారత్‌కి మళ్లీ వరల్డ్‌కప్‌ని అందించాడు. ఆరోజు తనకి మరిచిపోలేని రోజని చెప్పుకొచ్చిన గంగూలీ.. కెప్టెన్‌గా తనకి సాధ్యంకానిది ధోనీ సాధించినందుకు సంతోషించినట్లు గుర్తు చేసుకున్నాడు.
Samayam Telugu MS Dhoni


‘‘2003 వరల్డ్‌కప్ ఫైనల్లో నా కెప్టెన్సీలోనే టీమిండియా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కానీ.. కెప్టెన్‌గా ధోనీకి వరల్డ్‌కప్ గెలిచే అవకాశం రావడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఆరోజు నేను వాంఖడే స్టేడియంలోనే ఉన్నాను. మ్యాచ్ ఆఖర్లో ధోనీ, టీమిండియా సంబరాలను దగ్గర నుంచి చూసేందుకు కామెంట్రీ బాక్స్ నుంచి కిందకి వచ్చాను. నా వరకూ 2011 వన్డే ప్రపంచకప్‌ని భారత్ గెలవడం మరిచిపోలేని రోజు. ధోనీ కొట్టిన ఆ ఫినిషింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎంత గొప్ప క్షణాలవి..?’’ అని సౌరవ్ గంగూలీ గుర్తు చేసుకున్నాడు.

ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా 2011, ఏప్రిల్ 2న జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ టీమ్‌లో మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) సెంచరీతో చెలరేగాడు. ఛేదనలో గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4) శతక సమాన ఇన్నింగ్స్ ఆడగా.. ధోనీ (91 నాటౌట్ : 79 బంతుల్లో 8x4, 2x6) ఆఖరి వరకూ క్రీజులో నిలిచి 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్‌ని ముగించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.