యాప్నగరం

వారెవ్వా.. ఒకే టోర్నీలో రెండు ట్రిపుల్ సెంచరీలు

టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీలు బాదడం చూశాం. అది కూడా కొంతమంది స్టార్లకు మాత్రమే సాధ్యపడింది.

TNN 6 Oct 2017, 1:58 pm
టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీలు బాదడం చూశాం. అది కూడా కొంతమంది స్టార్లకు మాత్రమే సాధ్యపడింది. కానీ ఈ బుడతడు ఒకే టోర్నమెంట్‌లో రెండుసార్లు ట్రిపుల్ సెంచరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ అరుదైన రికార్డు నెలకొల్పింది మన తెలుగబ్బాయే. ఇప్పటికే సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్న నెల్లూరు చిచ్చరపిడుగు రేవంత్‌ రెడ్డి.. ప్రస్తుతం కడపలో జరుగుతున్న అంతర్‌జిల్లాల అండర్‌-14 క్రికెట్‌ పోటీల్లో సత్తాచాటాడు. ఇదే టోర్నీలో వారం రోజుల క్రితం ట్రిపుల్ సెంచరీకొట్టిన రేవంత్.. తాజాగా మరో ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డ్.
Samayam Telugu nellore kid hits two triple centuries in one tournament
వారెవ్వా.. ఒకే టోర్నీలో రెండు ట్రిపుల్ సెంచరీలు


నెల్లూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి గతనెల 23వ తేదీన విజయనగరం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 304 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తాజాగా గురువారం పశ్చిమగోదావరి జట్టుపై 289 బంతుల్లో 301 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన రేవంత్.. 95.76 స్ట్రయిక్‌ రేట్‌తో 746 పరుగులు సాధించడం విశేషం. ఈ టోర్నీ అక్టోబరు 9 వరకు కొనసాగుతుంది. కాబట్టి మిగిలిన మ్యాచుల్లో మరిన్ని పరుగులు సాధించే అవకాశం ఉంది.

కాగా, రేవంత్ రెడ్డి ప్రస్తుతం కడప నగరంలోని గురుకులం టెక్నో స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. ఇతని తండ్రి రామచంద్రారెడ్డి హైదరాబాద్‌లో సివిల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తల్లి పుష్పలత గృహిణి. రేవంత్ అన్నయ్య రోహన్‌ శ్రీకర్‌ చెన్నైలో బీటెక్‌ చదువుతున్నాడు. రేవంత్‌కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. అతనిలోని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వెన్నంటి ప్రోత్సహించారు. ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. 2011లో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. భారత జట్టుకు ఆడాలన్నదే లక్ష్యమని.. జోనల్, రంజీల్లో బాగా ఆడాలని ఇప్పటి నుంచే శిక్షణ తీసుకుంటున్నానని రేవంత్ చెబుతున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.