యాప్నగరం

అప్పుడు ధోనీ, ఇప్పుడు దినేశ్ కార్తీక్.. ఆఖరి బంతికి బంగ్లా బోల్తా

కొలంబోలో జరిగిన నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో దినేశ్ కార్తీక్ చివరి బంతికి సిక్స్ బాది భారత్‌‌ను గెలిపించిన రీతిలోనే.. చివరి బంతికి అద్భుతమైన రనౌట్‌తో గతంలో ధోనీ భారత్‌ను విజేతగా నిలిపాడు.

Samayam Telugu 19 Mar 2018, 11:03 am
కొలంబో వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో భారత్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతికి విజయానికి 5 పరుగులు అవసరమైన స్థితిలో దినేశ్ కార్తీక్ సిక్స్ బాది జట్టును గెలిపించాడు. టీమిండియా గెలవాలంటే రెండు ఓవర్లలో 34 పరుగులు అవసరమైన దశలో క్రీజ్‌లోకి వచ్చిన కార్తీక్.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ మలిచి తన ఉద్దేశాన్ని చాటాడు. ఆ ఓవర్లో 22 పరుగులు పిండుకున్న కార్తీక్.. చివరి ఓవర్ తుది బంతిని సిక్స్‌ బాది ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత్‌తోపాటు శ్రీలంక ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకున్నారు.
Samayam Telugu now dinesh karthik then ms dhoni did last ball magic against bangladesh
అప్పుడు ధోనీ, ఇప్పుడు దినేశ్ కార్తీక్.. ఆఖరి బంతికి బంగ్లా బోల్తా


బంగ్లాదేశ్ ఆఖరి బంతికి విజయం వాకిట బోల్తాపడింది. గతంలోనూ ఇదే తరహా ఉత్కంఠతో సాగిన మ్యాచ్‌లో బంగ్లా జట్టు చివరి బంతికి ఓటమిపాలైంది. 2016లో బెంగళూరులో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 146/7కే పరిమితమైంది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ విజయం దిశగా సాగింది. చివరి ఓవర్లో 11 పరుగులు చేస్తే బంగ్లాదే గెలుపు.

హార్దిక్ పాండ్య విసిరిన చివరి ఓవర్ మొదటి బంతికి మహ్మదుల్లా సింగిల్ తీయగా.. రెండు, మూడు బంతులను ముస్తాఫికర్ రహీమ్ బౌండరీకి తరలించాడు. బంగ్లా విజయానికి మూడు బంతుల్లో 2 పరుగులు మాత్రమే అవసరం. ఈ దశలో భారీ షాట్లకు యత్నించిన ముస్తాఫికర్, మహ్మదుల్లా వరుస బంతుల్లో వెనుదిరిగారు. దీంతో బంగ్లా విజయానికి చివరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి.


ఒక్క పరుగు చేస్తే మ్యాచ్ టైగా ముగిసే అవకాశం. దీంతో ధోనీ, నెహ్రా కలిసి బంతి ఎక్కడ విసరాలో పాండ్యకు సలహా ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఫీల్డింగ్ సెట్ చేశారు. క్రీజ్‌లోకి వచ్చిన షువగట పాండ్య విసిరిన బంతిని ఆడటంలో విఫలమయ్యాడు. కానీ సింగిల్‌ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని ముస్తాఫిజుర్ రహ్మాన్ వేగంగా పరిగెత్తుకొచ్చాడు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ధోనీ బౌలర్ బంతి విసరక ముందే కుడి చేతి గ్లోవ్ తీసి సిద్ధంగా ఉన్నాడు. బంతిని అందుకోవడమే ఆలస్యం.. వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి వికెట్లను గిరాటేశాడు. ధోనీ రనౌట్ చేయడతో ఒక్క పరుగు తేడాతో బంగ్లా అనూహ్యంగా ఓడగా.. భారత్ సంబరాల్లో మునిగిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.