యాప్నగరం

వరల్డ్‌కప్‌లో పాక్‌పై సచిన్ మెరుపులకి 9ఏళ్లు

2011 వన్డే ప్రపంచకప్‌లో అప్పటి వరకూ నిలకడగా ఆడిన సెహ్వాగ్, గంభీర్, యువరాజ్.. పాక్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తేలిపోయారు. దీంతో.. అప్పటి వరకూ జోరుమీద కనిపించిన భారత్ శిబిరంలో కంగారు. కానీ.. సచిన్ నిలిచాడు.

Samayam Telugu 30 Mar 2020, 9:08 am
భారత్ జట్టు 28 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2011లో మళ్లీ వరల్డ్‌కప్ గెలిచింది. కానీ.. ఆ టోర్నీ ఫైనల్‌ ముంగిట పాకిస్థాన్ రూపంలో టీమిండియాకి సెమీస్‌లో కఠిన సవాల్ ఎదురైంది. టోర్నీ ఆరంభం నుంచి నిలకడగా ఆడిన యువరాజ్ సింగ్ ఆ మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా.. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (38: 25 బంతుల్లో 9x4), గౌతమ్ గంభీర్ (27: 32 బంతుల్లో 2x4), విరాట్ కోహ్లీ (9: 21 బంతుల్లో) నిరాశపరిచారు. దీంతో.. భారత్‌కి మళ్లీ నిరీక్షణ తప్పదా..? అని భారత్‌ అభిమానుల్లో కంగారు. కానీ.. సచిన్ టెండూల్కర్ మొండిగా క్రీజులో నిలిచి.. టీమ్ బ్యాటింగ్ భారాన్ని మొత్తం మోసి ఫైనల్‌కి తీసుకెళ్లాడు.
Samayam Telugu Sachin


Read More: ఐపీఎల్ 2020 రద్దు..? చేతులెత్తేసిన బీసీసీఐ

పంజాబ్‌లోని మొహాలి వేదికగా 2011, మార్చి 30న జరిగిన ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు నిరాశపరిచినా.. సచిన్ టెండూల్కర్ (85: 115 బంతుల్లో 11x4) అసాధారణ ఇన్నింగ్స్‌తో పోరాడాడు. ఈ క్రమంలో మూడు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి సచిన్ తప్పించుకోగా.. మహేంద్రసింగ్ ధోని (25: 42 బంతుల్లో 2x4), సురేశ్ రైనా (36 నాటౌట్: 39 బంతుల్లో 3x4), హర్భజన్ సింగ్ (12: 15 బంతుల్లో 2x4) తేలిపోయారు. దీంతో 261 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కాపాడుకోగలదా..? అని అందరిలోనూ సందేహం.


కానీ.. లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల దెబ్బకి పాకిస్థాన్ 231 పరుగులకే కుదేలైంది. మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన భారత బౌలర్లందరూ తలో రెండు వికెట్లు పడగొట్టేశారు. ఆశిష్ నెహ్రా (2/33), మునాఫ్ పటేల్ (2/40) పొదుపుగా బౌలింగ్ చేసి తొలుత దాయాదిని ఒత్తిడిలోకి నెట్టగా.. ఆ తర్వాత జహీర్ ఖాన్ (2/58), హర్భజన్ సింగ్ (2/43), యువరాజ్ సింగ్ (2/57) వారిని కోలుకోనివ్వలేదు. ముఖ్యంగా.. మిడిల్ ఓవర్లలో హర్భజన్ సింగ్‌ని అప్పటి కెప్టెన్ ధోనీ ప్రయోగించిన తీరు ప్రశంసనీయం. మొత్తంగా పాకిస్థాన్ 49.5 ఓవర్లలోనే 231 పరుగులకి ఆలౌటవగా.. 29 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఫైనల్లో శ్రీలంకని చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.