యాప్నగరం

భారత క్రికెట్ చరిత్రలో ఈరోజు.. 2011 వరల్డ్‌కప్‌కి సరిగ్గా 9 ఏళ్లు

2011 వన్డే ప్రపంచకప్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది.. ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్. ఇప్పటికి 9 ఏళ్లు గడుస్తున్నా.. ఆ అపురూప క్షణాలు ఇంకా అభిమానుల మరిచిపోలేదు. ఈరోజు ఆ ఫైనల్ మ్యాచ్‌ని స్టార్‌స్పోర్ట్స్ ప్రసారం చేయనుంది.

Samayam Telugu 2 Apr 2020, 8:18 am
భారత క్రికెట్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకి తెరదించుతూ సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఏప్రిల్ 2న టీమిండియా వన్డే ప్రపంచకప్‌ని గెలిచింది. 1983లో తొలిసారి కపిల్‌దేవ్ సారథ్యంలో భారత్ జట్టు విశ్వవిజేతగా నిలవగా.. ఆ తర్వాత ధోనీ కెప్టెన్సీలో 2011లో మరోసారి టీమిండియా కప్‌ని ముద్దాడింది. ముంబయిలోని వాంఖడే వేదికగా భారీ అంచనాల నడుమ శ్రీలంకతో ఫైనల్ ఆడిన భారత్ జట్టు.. అభిమానుల 28 ఏళ్ల నిరీక్షణకి తెరదించుతూ వరల్డ్‌కప్‌ని అందించింది. ఆ అపురూప క్షణాల్ని నెమరు వేసుకుంటూ అభిమానులు ఎంజాయ్ చేయడానికి ఈరోజు మళ్లీ స్టార్‌స్పోర్ట్స్ ఛానల్ ఆ ఫైనల్ మ్యాచ్‌ని ప్రసారం చేయబోతున్నట్లు ప్రకటించింది.
Samayam Telugu MS Dhoni WC 2011 BAT


Read More : ధోనీకి యువరాజ్ డైరెక్ట్ పంచ్.. గంగూలీకి ఓటు

ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ టీమ్‌లో మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) అజేయ సెంచరీతో చెలరేగగా.. కుమార సంగక్కర (48), దిల్షాన్ (33) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు. ఇక భారత్ బౌలర్లలో జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ చెరొక రెండు వికెట్లు పడగొట్టగా.. హర్భజన్ సింగ్ ఒక వికెట్ తీశాడు. నువాన్ కులశేఖర(32)‌ని ధోనీ రనౌట్ చేశాడు.

Read More: షేన్‌వార్న్ టీమ్‌లో ధోనీ, కోహ్లీకి దక్కని చోటు

లక్ష్య ఛేదనలో భారత్‌కి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) ఆరంభంలోనే ఔటవగా.. విరాట్ కోహ్లీ (35) నిరాశపరిచాడు. కానీ.. గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4)తో కలిసి సంచలన ఇన్నింగ్స్ ఆడిన అప్పటి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (91 నాటౌట్: 79 బంతుల్లో 8x4, 2x6).. నాలుగో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో.. 48.2 ఓవర్లలోనే భారత్ జట్టు 277/4తో విజయాన్ని అందుకోగా.. ధోనీ కళ్లుచెదిరే సిక్స్‌తో మ్యాచ్‌ ముగించి భారత్‌ని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.