యాప్నగరం

AUS vs WI: రిక్కీ పాంటింగ్‌కు అస్వస్థత.. మ్యాచ్ మధ్యలోనే హాస్పిటల్‌‌కు తరలింపు

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ హాస్పిటల్ పాలయ్యారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా.. మూడో రోజు లంచ్ సమయంలో గుండె సంబంధిత సమస్య కారణంగా ఆయన హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. ఛానెల్ 7 తరఫున కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న ఆయన ముందు జాగ్రత్తగా టెస్టులు చేయించుకోవడం కోసం హాస్పిటల్‌లో చేరారని చెబుతున్నారు. తొలి టెస్టు మిగతా రెండు రోజుల్లో పాంటింగ్ అందుబాటులో ఉండే విషయమై స్పష్టత లేదు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 2 Dec 2022, 3:27 pm

ప్రధానాంశాలు:

  • అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిన రిక్కీ పాంటింగ్
  • పెర్త్ టెస్టులో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న పాంటింగ్
  • మూడో రోజు లంచ్ సమయంలో హాస్పిటల్‌లో చేరిక
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ricky Ponting
Ricky Ponting
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రిక్కీ పాంటింగ్ అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లో చేరారు. గుండె సంబంధింత సమస్యల కారణంగా ఆయన పెర్త్‌లోని ఓ హాస్పిటల్‌లో చేరారని తెలుస్తోంది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టుకు ఛానెల్ 7 తరఫున పాంటింగ్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాచ్ మూడో రోజు లంచ్ సమయంలో పాంటింగ్ కామెంటేటర్‌గా వ్యవహరించలేదు. దీంతో ఏమైందని ఆరా తీయగా.. హాస్పిటల్‌లో చేరారని తెలిసింది.
తాను బాగానే ఉన్నానని సహచరులకు పాంటింగ్ చెప్పారని తెలుస్తోంది. కానీ నలతగా అనిపించడంతో ముందు జాగ్రత్తగా పరీక్షల కోసం హాస్పిటల్‌కు వెళ్లారని సమాచారం. ‘పాంటింగ్‌కు ఒంట్లో బాగోలేదు. పెర్త్ టెస్ట్ మూడో రోజు మిగతా భాగానికి ఆయన కవరేజీ ఇవ్వడం లేదు’ అని ఛానెల్ 7 అధికార ప్రతినిధి తెలిపారని న్యూస్.కామ్.ఏయూ వెల్లడించింది.

ప్రస్తుతం పాంటింగ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఆసీస్, విండీస్ తొలి టెస్ట్ మిగతా రెండు రోజులకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారా లేదా అనే విషయం కూడా తెలియరాలేదు.

1974లో జన్మించిన రిక్కీ పాంటింగ్ భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌కు సమకాలీనుడు. ప్రపంచ క్రికెట్లోనే అత్యంత విజయవంతమైన సారథిగా పాంటింగ్ గుర్తింపు పొందాడు. 324 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన రిక్కీ.. 220 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. అతడి విజయాల శాతం 67.91 కావడం గమనార్హం. ఆధునిక క్రికెట్లో ఉత్తమ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన పాంటింగ్.. టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. పాంటింగ్ ఆస్ట్రేలియాకు రెండు వరల్డ్ కప్‌లను అందించాడు.

2012లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రిక్కీ.. ప్రస్తుతం కామెంటేటర్‌గా, కోచ్‌గా సేవలు అందిస్తున్నారు. ఐపీఎల్‌లో ఆయన ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.

Read More Sports News And Telugu News
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.