యాప్నగరం

అక్తర్ బౌలింగ్‌కి సచిన్ భయపడ్డాడు.. కాళ్లు వణకడం నేను చూశా: అఫ్రిది

షోయబ్ అక్తర్‌కి అప్పట్లో సచిన్ టెండూల్కర్ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ఎన్నో నిద్రలేని రాత్రుల్ని మిగిల్చాడు. ముఖ్యంగా.. 2003 వన్డే ప్రపంచకప్‌లో అక్తర్‌ బౌలింగ్‌లో సచిన్ కొట్టిన అప్పర్ కట్ సిక్స్ గురించి ఇప్పటికీ అభిమానులు చెప్పుకుంటున్నారు.

Samayam Telugu 8 Jul 2020, 2:24 pm
కరోనా వైరస్ నుంచి ఇటీవల కోలుకున్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు. మూడు రోజుల క్రితం పాకిస్థాన్ ఆధిపత్యాన్ని తట్టుకోలేక అప్పట్లో భారత క్రికెటర్లు దయచూపమని తమని వేడుకున్నారంటూ వెటకారపు వ్యాఖ్యలు చేసి మొట్టికాయలు తిన్న అఫ్రిది.. తాజాగా సచిన్ టెండూల్కర్‌ని లక్ష్యంగా చేసుకుని నోరుజారాడు. అప్పట్లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ బౌలింగ్‌ని ఎదుర్కోనేందుకు సచిన్ భయపడేవాడని చెప్పుకొచ్చిన అఫ్రిది.. ఓసారి సచిన్ కాళ్లు వణకడం తాను చూశానని వెల్లడించాడు.
Samayam Telugu Shoaib Akhtar ,Sachin Tendulkar


‘‘మైదానంలో మిడాఫ్ లేదా కవర్స్‌లో ఫీల్డింగ్ చేసేవారికి.. క్రీజులోని బ్యాట్స్‌మెన్‌ బాడీ లాంగ్వేజ్‌ని దగ్గర నుంచి పరిశీలించే అవకాశం ఉంటుంది. అప్పట్లో షోయబ్ అక్తర్‌ని ఎదుర్కొనేందుకు సచిన్ భయపడటాన్ని నేను చూశా. ఒక మ్యాచ్‌లో నేను స్వ్కేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. షోయబ్ అక్తర్ బౌలింగ్‌కి రావడంతో క్రీజులోని సచిన్ కాళ్లు వణకడాన్ని నేను చూశా. అయితే.. అక్తర్ బౌలింగ్‌లో ఆడేందుకు తాను భయపడ్డానని సచిన్ ఎలాగూ ఒప్పుకోడు. నేను కూడా సచిన్ ప్రతిసారి భయపడ్డాడని చెప్పడం లేదు. కొన్ని స్పెల్స్‌లో మాత్రం వెనకడుగు వేశాడని చెప్తున్నా. సచిన్ ఒక్కడే కాదు.. అప్పట్లో చాలా మంది అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లు సైతం అక్తర్ బౌలింగ్‌‌లో ఆడేందుకు భయపడ్డారు’’ అని అఫ్రిది వెల్లడించాడు.


వాస్తవానికి అప్పట్లో షోయబ్ అక్తర్ బౌలింగ్‌ని సచిన్ టెండూల్కర్ ఉతికారేశాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో అక్తర్ విసిరిన బౌన్సర్ బంతిని అప్పర్ కట్ రూపంలో కళ్లుచెదిరే సిక్స్ బాదిన సచిన్.. క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికీ సచిన్, అక్తర్ మధ్య ఆధిపత్య పోరు గురించి ప్రస్తావన వస్తే..? ఆ సిక్సర్‌ గురించే చెప్తుంటారు. అయితే.. ఆ ప్రపంచకప్‌లోనే గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరిన అక్తర్.. వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఇప్పటికీ రికార్డుల్లో కొనసాగుతున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.