యాప్నగరం

రచ్చచేసిన బంగ్లా క్రికెటర్లపై జరిమానా..!

ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గొడవకి దిగిన బంగ్లాదేశ్ క్రికెటర్లపై ఐసీసీ

TNN 17 Mar 2018, 5:35 pm
ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గొడవకి దిగిన బంగ్లాదేశ్ క్రికెటర్లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. 160 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ విజయానికి చివరి 6 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో బౌలింగ్‌కి వచ్చిన శ్రీలంక బౌలర్ ఉదాన తొలి రెండు బంతుల్ని షార్ట్ పిచ్ రూపంలో విసిరాడు. ఈ బంతులు రెండూ క్రీజులో ఉన్న ముస్తాఫిజుర్‌కి భుజం ఎత్తులో వెళ్లాయి. దీంతో.. రెండో బంతి బ్యాట్‌కి తాకకపోయినా.. పరుగు కోసం ప్రయత్నించి ముస్తాఫిజుర్ రనౌటయ్యాడు. ఈ సమయంలో క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ మహ్మదుల్లాకి డ్రింక్స్ అందించేందుకు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ నూరుల్ హసన్ మైదానంలోకి వచ్చాడు.
Samayam Telugu shakib nurul fined for breaching icc code of conduct
రచ్చచేసిన బంగ్లా క్రికెటర్లపై జరిమానా..!


ముస్తాఫిజుర్ ఔటైన బంతితో పాటు.. తొలి బంతిని కూడా నోబాల్‌గా ప్రకటించి ఉండాల్సింది అని.. మైదానంలోకి డ్రింక్స్‌ తీసుకొచ్చిన నూరుల్ ఫీల్డ్ అంపైర్లతో వాదనకి దిగాడు. ఈ సమయంలోనే నూరుల్ సమీపంలోకి శ్రీలంక కెప్టెన్ తిసార పెరీరా రావడంతో అతనిపై కూడా నూరుల్ నోరుపారేసుకున్నాడు. దీంతో.. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. అంపైర్లు తమకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నారంటూ.. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ మహ్మదుల్లాతో పాటు అప్పుడే క్రీజులోకి వచ్చిన రుబెల్‌ని మైదానం విడిచి వచ్చేయాలంటూ.. బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ డగౌట్ నుంచి ఆదేశించాడు. మ్యాచ్ ఆగిపోయే పరిస్థితి ఏర్పడటంతో అంపైర్లు, కోచ్‌లు కలగజేసుకోగా.. ఆట మళ్లీ కొనసాగింది. ఒకవేళ బంగ్లాదేశ్ ఆటగాళ్లు మ్యాచ్ ముగియక ముందే వెళ్లి ఉంటే.. జట్టుపై సస్పెన్షన్ వేటు పడేది.

ఈ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో మూడో బంతికి 4, ఆ తర్వాత 2, ఐదో బంతికి 6 బాదిన మహ్మదుల్లా బంగ్లాదేశ్‌కి 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. తాజాగా మైదానంలో గొడవపై విచారణ ప్రారంభించిన ఐసీసీ.. క్రమశిక్షణ తప్పి, క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించిన నూరుల్, షకిబ్ అల్ హసన్‌కి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకుంది. వీరికి జరిమానాతో పాటు చెరొక డీమెరిట్ పాయింట్లు వారివారి ఖాతాలో చేరనున్నాయి. మ్యాచ్‌లో గెలిచిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెటర్లు నాగినీ డ్యాన్స్‌తో మైదానాన్ని హోరెత్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.