యాప్నగరం

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక ఖరారు.. భారత్ విజయం రుచి చూడని చోట..!

World Test Championship Final వేదికను ఐసీసీ ఖరారు చేసింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో చర్చించిన ఐసీసీ సౌంతప్టన్‌లో ఫైనల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్ 18న భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Samayam Telugu 10 Mar 2021, 4:16 pm
భారత్, న్యూజిలాండ్ మధ్య జరగబోతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వేదిక ఖరారైంది. జూన్ 18 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు మ్యాచ్‌ను సౌతాంప్టన్‌లోని హాంప్‌షైర్ బౌల్‌ వేదికగా నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. కరోనా ప్రభావం తక్కువగా ఉండేలా చూడటం కోసం.. ఎక్కడ మ్యాచ్ నిర్వహించాలనే విషయమై.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో చర్చించిన తర్వాత ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu Kane Williamson and Virat Kohli in Test cricket 2020
Image: Twitter/ICC


గత ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగిన అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్, సౌతాంప్టన్‌లోని హాంప్‌షైర్ బౌల్‌ ఆతిథ్యం ఇచ్చాయి. సౌతాంప్టన్‌లో ఇప్పటి వరకూ ఆరు టెస్టులు మాత్రమే జరగ్గా.. మూడింట్లో ఫలితం తేలింది. ఒక టెస్టులో వెస్టిండీస్ గెలవగా.. మిగతా రెండింట్లో ఆతిథ్య ఇంగ్లాండ్ గెలిచింది. ఆ రెండూ భారత్‌పైనే కావడం గమనార్హం. ఇదే వేదికపై 2014లో 266 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించిన ఇంగ్లాండ్ 2018లో 60 పరుగుల తేడాతో ఓడించింది. ఈ వేదికపై న్యూజిలాండ్ ఇంత వరకూ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు.

కరోనా నేపథ్యంలో వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్‌ను వీక్షించేందుకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంది. అందరి ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని.. రెండు అత్యుత్తమ టెస్టు జట్లు తలపడే ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు చూసే అవకాశం కల్పించడం కోసం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వేదికగా సౌతాంప్టన్‌ను ఖరారు చేశామని ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అల్‌డ్రైస్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.