యాప్నగరం

సచిన్.. అక్రమ్‌ను చేయి వేయనీయొద్దు..!

పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ అంటే భారత అభిమానులకు పండగ. ఎంతో కసి.. మరెన్నో భావోద్వేగాలు.

TNN 25 Oct 2017, 10:05 am
పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ అంటే భారత అభిమానులకు పండగ. ఎంతో కసి.. మరెన్నో భావోద్వేగాలు. పాకిస్థాన్‌పై టీమిండియా గెలిస్తే.. మనమే స్వయంగా గెలిచినంత ఆనందపడతాం. అది దేశం మీద, క్రికెట్ మీద మనకున్న భక్తి, అభిమానం. మరి అలాంటప్పుడు మైదానంలో మన ఆటగాళ్లతో పాకిస్థానీ ప్లేయర్లు అనుచితంగా ప్రవర్తించినా, అవమానించినా మనం తట్టుకోగలమా..? ఇదే విషయాన్ని భారత లెజండరీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రస్తావించారు. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ రాసిన ‘డెమోక్రసీస్ లెవెన్ - ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం ముంబైలో జరిగింది.
Samayam Telugu sunil gavaskar sachin tendulkar share riveting cricket tales
సచిన్.. అక్రమ్‌ను చేయి వేయనీయొద్దు..!


ఈ కార్యక్రమంలో పాతతరం ఆటగాళ్లు నారీ కాంట్రాక్టర్, మాధవ్ ఆప్టే, వారి తర్వాతి తరం అజిత్ వాడేకర్, మహ్మద్ అజారుద్దీన్ సహా సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ పాల్గొన్నారు. క్రికెట్ దిగ్గజాలంతా ఒకేచోట చేరి అభిమానులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్ క్రికెటర్లతో మైదానం వెలుపల స్నేహం, సచిన్ భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో అతనికి ఇచ్చిన సళమాలను గవాస్కర్ గుర్తుచేసుకున్నారు. ‘నువ్వు టాస్ కోసం మైదానంలోకి వెళ్లే సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ వసీం అక్రమ్‌ను నీ భుజాల మీద చేతులు వేయనీయొద్దు. వారు అప్పుడప్పుడు అలా చేస్తుంటారు. అది దేశభక్తికి సంబంధించిన విషయం. కాబట్టి చేతులు వేయనీయొద్దు’ అని సచిన్‌కి చెప్పినట్లు సన్నీ వెల్లడించారు.

టెండ్‌ల్యా ఇక పడుకోవాలి..!
సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. లెజండరీ కెప్టెన్ కపిల్ దేవ్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. తాను టీమిండియాలో చేరిన కొత్తలో కపిల్ దేవ్ తన రూమ్ మేట్‌గా ఉండేవారిని చెప్పాడు. దీంతో తాను చాలా క్రమశిక్షణ కలిగి ఉండేవాడినని, కపిల్ సూచనలు పాటించేవాడనని గుర్తు చేసుకున్నారు. రాత్రి 10.30 అయితే కపిల్ లైట్లన్నీ ఆపేసి ‘టెండ్‌ల్యా అబ్ సోనా హై (టెండ్‌ల్యా ఇక పడుకోవాలి)’ అని అనేవారని తెలిపాడు. ఉదయం 9 గంటలకు తాము మైదానానికి వెళ్లాలని, అయితే కపిల్ తనను 8.15 గంటలకు నిద్రలేపే వారని చెప్పాడు. ‘టెండ్‌ల్యా నీకోసం టీ తీసుకురానా? అని కపిల్ అడిగేవారు. నేను వెంటనే బెడ్ మీద నుంచి దిగి.. లేదు పాజీ నేనే మీకు టీ తీసుకొస్తాను అని చెప్పేవాడిని’ అని కపిల్ స్వభావం గురించి సచిన్ చెప్పుకొచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.