యాప్నగరం

IND vs AUS T20 సిరీస్ రద్దు..? రెండ్రోజుల్లో క్లారిటీ

టీ20 వరల్డ్‌కప్ ముంగిట ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్ ఆడితే టీమిండియాకి మంచి ప్రాక్టీస్ దొరికినట్లవుతుందని బీసీసీఐ ఆశించింది. కానీ.. ఆ టోర్నీనే వాయిదాపడితే..?

Samayam Telugu 8 Jun 2020, 12:17 pm
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ20 సిరీస్ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 11 నుంచి 17 వరకూ ఆస్ట్రేలియా గడ్డపై మూడు టీ20 సిరీస్‌ని టీమిండియా ఆడాల్సి ఉంది. కానీ.. అక్టోబరు 18 నుంచి ప్రారంభంకావాల్సిన టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడనుండటంతో ఈ టీ20 సిరీస్‌ని కూడా రద్దు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. అక్టోబరు 11న బ్రిస్బేన్‌లో తొలి టీ20....... అక్టోబరు 14న కాన్‌బెర్రాలో రెండో టీ20..... అక్టోబరు 17న అడిలైడ్‌లో మూడో టీ20 జరగాల్సి ఉంది.
Samayam Telugu India vs Australia T20I series


వాస్తవానికి టీ20 వరల్డ్‌కప్‌ సన్నద్ధత కోసమే బీసీసీఐ ఈ టీ20 సిరీస్‌ని ఆడేందుకు తొలుత అంగీకరించింది. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సెప్టెంబరు వరకూ పర్యాటక వీసాలపై నిషేధం విధించడంతో షెడ్యూల్ ప్రకారం టీ20 వరల్డ్‌కప్‌ని నిర్వహించలేమని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇప్పటికే తేల్చేసింది. దాంతో.. వరల్డ్‌కప్‌ని ఐసీసీ వాయిదా వేయాలని చూస్తుండగా.. ఆ అక్టోబరు - నవంబరు విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.

టీ20 వరల్డ్‌కప్ వాయిదా పడితే..? టీమిండియాకి ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రాక్టీస్ అవసరంలేనందున ఆ మూడు టీ20ల సిరీస్‌ని రద్దు చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. దానికి తోడు ఐపీఎల్ ఆలోచన కూడా ఉండటంతో అక్టోబరు - నవంబరు నెలలో టీమిండియా క్రికెటర్లు బిజీగా ఉండనున్నారు. ఆ తర్వాత డిసెంబరు 3 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు సిరీస్‌ ఆడేందుకు తాము సిద్దమని ఇటీవల బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్ వాయిదాపై ఈ నెల 10న ఐసీసీ నిర్ణయం ప్రకటించనుండగా.. ఆరోజే ఈ టీ20 సిరీస్‌పైనా బీసీసీఐ క్లారిటీ ఇవ్వనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.