యాప్నగరం

విఫలమైన టాప్‌ ఆర్డర్.. 134 పరుగులు వెనుకబడిన భారత్

India vs England: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ మినహా.. మిగతావారెవరూ హాఫ్‌ సెంచరీ మార్కు కూడా దాటలేకపోయారు. దీంతో భారత్‌ 177 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే ధ్రువ్ జురెల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌లు అబేధ్యమైన 8వ వికెట్‌కు 42 పరుగులు జోడించి.. రెండో రోజు ఆటను 219/7 వద్ద ముగించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 353 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 24 Feb 2024, 5:18 pm
రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత టాప్‌ ఆర్డర్ బ్యాటర్లు తడబడ్డారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 రన్స్‌కు ఆలౌట్‌ అయింది. బదులుగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌ను ఇంగ్లాండ్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. స్పిన్నర్‌ రషీద్‌ ధాటికి భారత్‌ ఓ దశలో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. యువ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ పోరాడటంతో టీమిండియా మరో వికెట్‌ కోల్పోకుండా రెండో రోజు ఆటను 219 వద్ద ముగించింది.
Samayam Telugu IND vs ENG: Rohit Sharma
రోహిత్ శర్మ


302/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్.. తొలి సెషన్‌లో మరో 51 పరుగులు జోడించి చివరి మూడు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆటలో సెంచరీ చేసిన జో రూట్.. 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓలీ రాబిన్సన్‌ (58), బెన్‌ ఫోక్స్‌ (47) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్‌ దీప్‌ 3, మహమ్మద్‌ సిరాజ్‌ 2, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక వికెట్‌ తీశారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. 4 పరుగుల వద్దే రోహిత్ శర్మ (2) వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో యశస్వి జైశ్వాల్‌ (73), శుభ్‌మన్‌ గిల్‌ (38) రాణించడంతో 86/1తో నిలిచింది. కానీ, స్వల్ప వ్యవధిలో గిల్‌, రజత్‌ పటీదార్‌ (17), రవీంద్ర జడేజా (12) ఔట్‌ అయ్యారు. ఆ తర్వాత కాసేపటికే జైశ్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ (14), రవిచంద్రన్‌ అశ్విన్‌ (1) సైతం పెవిలియన్‌ చేరారు. దీంతో భారత్‌ 177/7తో నిలిచింది.

ఈ పరిస్థితుల్లో కెరీర్‌లో రెండో టెస్టు ఆడుతున్న ధ్రువ్‌ జురెల్‌ (58 బంతుల్లో 30 రన్స్‌), కుల్‌దీప్‌ యాదవ్‌ (72 బంతుల్లో 17 రన్స్‌) ఆదుకున్నారు. అబేధ్యమైన 8వ వికెట్‌కు 42 పరుగులు జోడించారు. దీంతో రెండో రోజు చివరి సెషన్‌లో భారత్‌ మరో వికెట్‌ కోల్పోకుండా 217 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ పరుగులను చేధించేందుకు భారత్‌ ఇంకా 134 పరుగులు వెనకబడి ఉంది.

ఇంగ్లాండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 4 వికెట్లు పడగొట్టాడు. టామ్‌ హార్ట్లీ 2, జేమ్స్‌ అండర్సన్‌ 1 వికెట్‌ తీశారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.