యాప్నగరం

రెండో వన్డేలోనూ ఆసీస్‌దే గెలుపు.. సిరీస్ చేజార్చుకున్న భారత్

భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 389 రన్స్ చేయగా.. భారత్ 338 రన్స్‌కే పరిమితమైంది.

Samayam Telugu 29 Nov 2020, 5:25 pm
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 51 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 390 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 9 వికెట్ల నష్టానికి 338 పరుగులకే పరిమితమైంది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (28), శిఖర్ ధావన్ (30) తొలి వికెట్‌కు 7.4 ఓవర్లలో 58 పరుగులు జోడించారు. కానీ రెండు పరుగుల వ్యవధిలోనే వీరిద్దరూ ఔటవడంతో భారత్ కష్టాల్లో పడింది.
Samayam Telugu aus team
Image: Twitter/AIR


ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లి (89), శ్రేయస్ అయ్యర్ (38) మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. అయ్యర్ ఔటైనా రాహుల్‌తో కలిసి కోహ్లి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. కానీ జట్టు స్కోరు 224 పరుగుల వద్ద కోహ్లి ఔటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పాండ్య ఆరంభంలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. సాధించాల్సిన నెట్ రన్ రేట్ పెరిగిపోతుండటంతో.. భారీ షాట్లకు యత్నించిన రాహుల్ (66 బంతుల్లో 76).. స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

43.4 ఓవర్లలో జట్టు స్కోరు 289 పరుగుల వద్ద క్రీజ్‌లోకి వచ్చిన జడేజా (11 బంతుల్లో 24) దూకుడుగా ఆడి ఆశలు రేపాడు. చివరి 4 ఓవర్లలో భారత్ విజయానికి 69 పరుగులు అవసరమైన దశలో.. కమిన్స్ బౌలింగ్‌లో జడేజా, పాండ్య భారీ షాట్లకు యత్నించి ఔటయ్యారు. దీంతో భారత్ ఓటమి ఖాయమైంది.

అంతకు ముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ తొలి వికెట్‌కు 142 పరుగులు జోడించి ఆసీస్‌కు మరోసారి శుభారంభం ఇచ్చారు. ఫించ్ (60), వార్నర్ (83) కొద్ది వ్యవధిలోనే ఔటైనా.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్టీవ్ స్మిత్ (64 బంతుల్లో 104).. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 62 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 14 ఫోర్లు, 2 సిక్సులు బాదిన స్మిత్ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.

స్మిత్‌కు లబుషానే (61 బంతుల్లో 70) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 156 పరుగులు జోడించారు. స్మిత్ స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ 29 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 389 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో టాప్-5 బ్యాట్స్‌మెన్ 50కిపైగా రన్స్ చేయడం విశేషం. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లు తీయగా.. హేజిల్‌వుడ్, జంపా తలో రెండు వికెట్లు తీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.