యాప్నగరం

హర్భజన్ ఆ చెంప దెబ్బపై చింతించాడు..!

పంజాబ్ టీమ్ గెలిచిన ఆనందంలో ఉన్న శ్రీశాంత్.. మ్యాచ్ తర్వాత హర్భజన్ సింగ్‌ని కవ్వించే తరహాలో వ్యహరించాడు. దీంతో.. అప్పటికే ముంబయి టీమ్ ఓటమి బాధలో ఉన్న భజ్జీ అతనిపై చేయి చేసుకున్నాడు.

Samayam Telugu 11 Apr 2020, 7:44 pm
ఐపీఎల్ 2008 సీజన్‌లో ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌పై చేయి చేసుకోవడంపై వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చింతించినట్లు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డొమినిక్ థోర్లీ వెల్లడించాడు. ఆ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ టీమ్‌కి హర్భజన్ సింగ్, డొమినిక్ థోర్లీ కలిసి ఆడగా.. కింగ్స్ ఎలెవన్ టీమ్ తరఫున శ్రీశాంత్ ఆడాడు. ఈ క్రమంలో ముంబయి, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సహనం కోల్పోయిన హర్భజన్ సింగ్.. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకునే సమయంలో శ్రీశాంత్‌ని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో.. ఆ సీజన్ మొత్తానికీ హర్భజన్ సింగ్‌ని సస్పెండ్ చేశారు.
Samayam Telugu Harbhajan Singh


Read More: సచిన్ తప్పు కోసం వెయిట్ చేసేవాళ్లం: క్లార్క్

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ 182 పరుగులు చేయగా.. ఛేదనలో నిరాశపరిచిన ముంబయి ఇండియన్స్ 66 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. బౌలర్‌గా మూడు వికెట్లు పడగొట్టిన హర్భజన్ సింగ్.. బ్యాట్స్‌మెన్‌గా మాత్రం డకౌటయ్యాడు. దీంతో.. ఆవేశంగా డగౌట్‌కి వచ్చిన హర్భజన్ సింగ్ అక్కడ తనతోనూ కోపంగా మాట్లాడినట్లు డొమినిక్ థోర్లీ వెల్లడించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మ్యాచ్ ముగియగా.. శ్రీశాంత్‌పై చేయి చేసుకోవడం తనని ఆశ్చర్యపరిచిందని డొమినిక్ థోర్లీ వివరించాడు.

Read More: ధోనీని ఆ సమస్య బాధపెట్టింది: మాజీ కీపర్

‘‘ఆ మ్యాచ్‌లో ఔటైన హర్భజన్ సింగ్ చాలా నిరాశతో కనిపించాడు. అతను డగౌట్‌లో నా పక్కనే కూర్చున్నాడు. అప్పటికే ఛేదనలో ముంబయి 8 వికెట్లు చేజార్చుకుని ఉండటంతో గెలుపు ఆశలు ఏమీలేవు. భజ్జీ ఔటైన ఐదు నిమిషాల వ్యవధిలోనే మ్యాచ్ కూడా ముగిసిపోయింది. అయితే.. ఆటగాళ్లు ఫార్మాటలీగా షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకుంటున్న సమయంలో.. శ్రీశాంత్‌కి చెంప దెబ్బ పడింది. నాకు, హర్భజన్‌కి మధ్య నలుగురు ఆటగాళ్లు మాత్రమే అప్పుడు ఉన్నారు. అంత వేగంగా ఆ ఘటన ఎలా జరిగిందో..? మాకు అర్థంకాలేదు. శ్రీశాంత్‌ని చెంపదెబ్బ కొట్టిన తర్వాత హోటల్‌కి వచ్చిన హర్భజన్ సింగ్.. అలా చేసి ఉండకూడదని చింతించాడు’’ అని డొమినిక్ థోర్లీ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.