యాప్నగరం

సచిన్ రిటైర్మెంట్ రోజున అత్యంత విలువైన గిఫ్ట్ ఇచ్చిన కోహ్లి.. ఇంత కంటే గొప్పది లేదు!

Sachin Tendulkar రిటైర్మెంట్ సందర్భంగా భావోద్వేగానికి లోనైన కోహ్లి తన దగ్గరున్న అత్యంత విలువైన గిఫ్ట్‌ను తన ఆరాధ్య క్రికెటర్‌కు కానుకగా ఇచ్చేశాడు.

Samayam Telugu 16 Nov 2020, 3:01 pm
క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ ఆటకు వీడ్కోలు పలికి నేటికి సరిగ్గా ఏడేళ్లు. 2013లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు తర్వాత సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘22 గజాల పిచ్ మీద 24 ఏళ్లు గడిపాను. నా క్రికెట్ ప్రయాణం ముగిసిందని నమ్మలేకపోతున్నా’నంటూ మ్యాచ్ అనంతరం సచిన్ భావోద్వేగానికి లోనయ్యాడు. చివరి ఇన్నింగ్స్‌లో 74 రన్స్ చేసిన టెండుల్కర్.. 16 వేల పరుగులకు 79 పరుగుల దూరంలో నిలిచాడు. 2012లోనే వన్డేలకు వీడ్కోలు పలికిన సచిన్.. 2013లో టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ ఏడాదే ముంబై ఇండియన్స్ తరఫున చివరిసారిగా ఆడాడు.
Samayam Telugu Sachin Tendulkar, Virat Kohli
Sachin Tendulkar and Virat Kohli. (File Pic - Getty Images)


సచిన్ రిటైర్మెంట్ వేళ కోట్లాది మంది అభిమానులు, తోటి క్రికెటర్లు భావోద్వేగానికి లోనయ్యారు. కోహ్లి, ధోనీ సహా భారత క్రికెటర్లు సచిన్‌ను భుజాలపై మోస్తూ.. మైదానం చుట్టూ కలియదిరిగారు. చేతిలో జాతీయ జెండాతో అభిమానులకు అభివాదం చేసిన సచిన్.. భారమైన హృదయంతో తనకెంతో ఇష్టమైన క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

చిన్నతనం నుంచి సచిన్ ఆట చూస్తూ పెరిగి పెద్దవాడైన విరాట్ కోహ్లి.. తన అభిమాన క్రికెటర్ రిటైర్మెంట్ వేళ ఉద్వేగానికి లోనయ్యాడు. సచిన్ జీవితంలో అంతా సవ్యంగా జరగాలని కోరుకుంటూ... తన ఆరాధ్య క్రికెటర్‌కు పవిత్ర దారాన్ని విరాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. వాస్తవానికి ఈ దారాన్ని కోహ్లికి ఆయన తండ్రి ఇచ్చారు. దాన్ని కోహ్లి ఎప్పుడూ తన బ్యాగ్‌లోనే దాచుకునేవాడు. ఆ దారాన్ని అత్యంత విలువైందిగా భావించే కోహ్లి.. సచిన్‌పై ఉన్న గౌరవంతో ఆయనకు ఇచ్చేశాడు.

‘మీకు ఇవ్వడానికి ఇంత కంటే విలువైన గిఫ్ట్ ఏదీ నా దగ్గర లేదు. నాపై మీ ప్రభావం ఎంతో ఉంది. మీరంటే మాకెంత ఇష్టమో చెప్పడానికి ఈ దారమే నిదర్శనం. ఇదే నా చిరు కానుక’ అంటూ సచిన్‌కు తనకు ఎంతో ఇష్టమైన దారాన్ని కోహ్లి ఇచ్చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.