యాప్నగరం

Virat Kohli: ఆసీస్ గడ్డపై కోహ్లిని ఊరిస్తోన్న సచిన్ రికార్డ్!

ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభం కానున్న 4 టెస్టుల సిరీస్ కోసం భారత్ సన్నద్ధం అవుతున్న వేళ.. కెప్టెన్ విరాట్ కోహ్లిని సచిన్ రికార్డ్ ఊరిస్తోంది.

Samayam Telugu 29 Nov 2018, 4:28 pm
ఆస్ట్రేలియా గడ్డ మీద త్వరలో ప్రారంభం కానున్న 4 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధం అవుతోంది. వార్నర్, స్మిత్ గైర్హాజరీ ఆసీస్ జట్టు బలహీనంగా ఉంది. దీంతో కంగారుల గడ్డపై సిరీస్ విజయానికి ఇదే సరైన తరుణమని భారత్ భావిస్తోంది. కాగా ఈ సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లిని అరుదైన రికార్డ్ ఊరిస్తోంది. రానున్న టెస్టు సిరీస్‌లో మరో సెంచరీ సాధిస్తే.. ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ రికార్డును కోహ్లి సమం చేస్తాడు.
Samayam Telugu kohli 100


ఆస్ట్రేలియాలో 20 మ్యాచ్‌లు ఆడిన సచిన్ ఆరు సెంచరీలు సాధించగా.. కోహ్లి 11 మ్యాచ్‌ల్లో ఐదు శతకాలు బాదాడు. మాజీ ఓపెనర్ సునీల్ గావస్కర్ కూడా 11 మ్యాచ్‌ల్లో ఐదు శతకాలు చేశాడు.

ఈ ఏడాది దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, విండీస్‌లపై కోహ్లి శతకాలు సాధించాడు. 2018లో 10 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 59.05 సగటుతో 1063 పరుగులు చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారీగా పరుగులు రాబట్టి కోహ్లి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అదే ఊపును ఆసీస్ టూర్‌లోనూ కొనసాగిస్తే.. సచిన్ రికార్డును అధిగమించడం పెద్ద కష్టమేం కాదు.

కోహ్లి టెస్టుల్లో 7 వేల పరుగులు పూర్తి చేయడానికి కేవలం 669 పరుగుల దూరంలో ఉన్నాడు. ఫాస్టెస్ట్ 7 వేల పరుగుల జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన వాలీ హమ్మద్ తొలి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో సెహ్వాగ్, సచిన్ ఉన్నారు. హమ్మద్ 131 ఇన్నింగ్స్‌ల్లో ఏడు వేల పరుగులు చేయగా.. కోహ్లి ఇప్పటి వరకూ 124 ఇన్నింగ్స్ ఆడాడు. మరో 8 ఇన్నింగ్స్‌ల్లో 669 పరుగులు చేస్తే.. విరాట్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.