యాప్నగరం

IND vs WI రెండో వన్డేలో షై హోప్ శతకం.. భారత్ టార్గెట్ 312

2nd ODI IND vs WI: భారత్‌తో వన్డే సిరీస్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ టీమ్ 300 పరుగుల మార్క్‌ని అందుకుంది. గత శుక్రవారం రాత్రి జరిగిన తొలి వన్డేలో 305 పరుగులు చేసిన కరీబియన్ టీమ్.. ఈరోజు కూడా 311 పరుగులు చేసింది.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 24 Jul 2022, 11:04 pm

ప్రధానాంశాలు:

  • భారత్‌పై సెంచరీ బాదిన షై హోప్
  • నికోలస్ పూరన్ సిక్సర్ల మోత
  • మూడు వికెట్లు పడగొట్టిన శార్ధూల్ ఠాకూర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu IND vs WI 2nd ODI (Pic Source: Twitter)
IND vs WI 2nd ODI (Pic Source: Twitter)
India vs West Indies 2nd ODI: ట్రినిడాడ్ వేదికగా ఆదివారం రాత్రి జరుగుతున్న రెండో వన్డేలో పర్యాటక భారత్ జట్టు ముందు 312 పరుగుల టార్గెట్‌ని ఆతిథ్య వెస్టిండీస్ నిర్దేశించింది. ఓపెనర్ షై హోప్ (115: 135 బంతుల్లో 8x4, 3x6) సెంచరీ బాదడంతో మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. షై హోప్‌ (Shai Hope)తో పాటు కెప్టెన్ నికోలస్ పూరన్ (74: 77 బంతుల్లో 1x4, 6x6) కూడా మిడిల్ ఓవర్లలో దూకుడుగా ఆడేశాడు. భారత బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ (Shardul Thakur) మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ హుడా, అక్షర్ పటేల్, చాహల్ తలో వికెట్ తీశారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన నికోలస్ పూరన్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. కైల్ మేయర్స్ (39: 23 బంతుల్లో 6x4, 1x6)తో కలిసి వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన షై హోప్ తొలి వికెట్‌కి 9.1 ఓవర్లలో 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ ఓపెనింగ్ జోడీని దీపక్ హుడా తాను మ్యాచ్‌లో వేసిన మొదటి బంతికే విడదీశాడు. హుడా విసిరిన బంతిని అంచనా వేయలేకపోయిన మేయర్స్ అతనికే సులువైన క్యాచ్ ఇచ్చేశాడు. ఆ తర్వాత వచ్చిన సామ్రాహ్ బ్రూక్స్‌ (35: 36 బంతుల్లో 5x4)ని అక్షర్ పటేల్ బోల్తా కొట్టించగా.. బ్రాండన్ కింగ్ (0)ని డకౌట్‌గా చాహల్ పెవిలియన్ బాట పట్టించాడు. దాంతో.. 22.5 ఓవర్లు ముగిసే సమయానికి వెస్టిండీస్ 130/3తో నిలిచింది.

ఈ దశలో షై హోప్‌తో కలిసి నికోలస్ పూరన్ (Nicholas Pooran) శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి మరీ భారీ సిక్సర్లు బాదేసిన నికోలస్ పూరన్.. పేసర్లనీ వదల్లేదు. దాంతో.. షై హోప్ ఓ 7-10 ఓవర్లు స్ట్రైక్ రొటేట్ చేయడంతోనే సరిపెట్టాడు. మరోవైపు స్కోరు బోర్డుని నడపించే బాధ్యత తీసుకున్న నికోలస్ పూరన్.. చకచకా పరుగులు చేసి నాలుగో వికెట్‌కి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. ఇన్నింగ్స్ 44వ ఓవర్‌లో శార్ధూల్ ఠాకూర్ అతడ్ని తెలివిగా ఔట్ చేశాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్లి షాట్లు ఆడుతున్న పూరన్‌కి లెగ్ స్టంప్‌ని లక్ష్యంగా చేసుకుని శార్ధూల్ బంతిని విసరగా.. అతను బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రొవ్‌మెన్ పొవెల్ (13: 10 బంతుల్లో 1x4, 1x6) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటైపోయినా.. రొమారియో షెఫర్డ్ (15 నాటౌట్: 11 బంతుల్లో 2x4), అకేల్ హొసెన్ (6 నాటౌట్: 4 బంతుల్లో 1x6) చివర్లో విలువైన పరుగులు చేశారు.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.