యాప్నగరం

సిక్సర్ల మోత మోగించిన యువరాజ్ .. ఒకే ఓవర్లో 4 సిక్సులు.. ఐదు రోజుల్లో రెండోసారి!

Road Safety World Seriesలో యువరాజ్ అదరగొడుతున్నాడు. ఐదు రోజుల వ్యవధిలో రెండోసారి సిక్సర్ల మోత మోగించాడు. విండీస్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 4 సిక్సులు బాదాడు.

Samayam Telugu 17 Mar 2021, 9:37 pm
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. దాదాపు రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినా తనలో సత్తా చాటలేదని మరోసారి నిరూపించాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ బ్రాడ్ బౌలింగ్‌లో ఓకే ఓవర్లో ఆరు సిక్సులు బాదిన యువీ.. 13 ఏళ్ల తర్వాత కూడా దాదాపు అదే ఫీట్‌ను రెండుసార్లు రిపీట్ చేశాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ టూర్‌ సిరీస్‌లో భాగంగా.. వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ జూలు విదిల్చాడు. ఒకే ఓవర్లో నాలుగు సిక్సులు బాదాడు.
Samayam Telugu Yuvraj Singh
Yuvraj Singh ( Twitter)


మహేంద్ర నాగముత్తూ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో.. తొలి మూడు బంతులను సిక్సులుగా మలిచిన యువీ.. ఐదో బంతిని సైతం సిక్స్‌గా బాదాడు. ఈ మ్యాచ్‌లో ఒక ఫోర్, ఆరు సిక్సులు కొట్టిన యువరాజ్.. 20 బంతుల్లో 49 రన్స్ చేశాడు. యూసుఫ్ పఠాన్ 20 బంతుల్లో 37 పరుగులు చేయడంతో.. భారత్ 218 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సచిన్ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

గతవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ యువీ సిక్సర్లతో వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే. మీడియం పేసర్ జండెర్ డీ బ్ర్యూన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో యువరాజ్ వరుసగా 4 సిక్సులు కొట్టాడు. ఆ మ్యాచ్‌లో 6 సిక్సులు, 2 ఫోర్లు బాదిన యువీ.. 22 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. మునుపటి యువరాజ్‌ను తలపించేలా.. ఈ లెఫ్ట్ హ్యాండర్ అలవోకగా సిక్సులు బాదుతుండటాన్ని ఫ్యాన్స్ ఆస్వాదిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.