యాప్నగరం

ఈరోజే IND vs AUS వార్మప్ మ్యాచ్.. రోహిత్ శర్మ బరిలోకి దిగే ఛాన్స్

ఆస్ట్రేలియాతో ఈరోజు వార్మప్ మ్యాచ్‌లో భారత్ జట్టు ఓ రెండు మార్పులతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్‌రౌండర్, స్పిన్నర్ స్థానాలపై గత కొన్నిరోజులుగా సందిగ్ధతలో ఉన్న టీమిండియాకి ఈరోజు మ్యాచ్‌తో ఓ క్లారిటీ రానుంది.

Samayam Telugu 20 Oct 2021, 8:54 am
టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ముంగిట తుది జట్టు కూర్పుపై ఓ క్లారిటీకి వచ్చేందుకు టీమిండియాకి ఈరోజు ఆఖరి అవకాశం. దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకి వార్మప్ మ్యాచ్‌లో భారత్ జట్టు తలపడనుంది. గత సోమవారం జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ.. ఈరోజు జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్‌తో దుబాయ్ వేదికగానే ఆదివారం భారత్ జట్టు తలపడనుంది.
Samayam Telugu India (Pic Credit: BCCI/Twitter)


ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఆడగా.. ఈరోజు మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో.. ఇషాన్ కిషన్‌ని బెంచ్‌పై కూర్చోబెడతారా..? లేదా సూపర్ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కి రెస్ట్ ఇస్తారా..? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అలానే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్థానంలో శార్ధూల్ ఠాకూర్‌కి అవకాశమివ్వాలని డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుండటంతో ఈ మ్యాచ్‌లో శార్ధూల్ ఠాకూర్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో..? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

స్పిన్నర్ల విషయంలోనూ భారత్ ఓ క్లారిటీకి రాలేకపోతోంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంచనాల్ని అందుకోలేకపోతుండగా.. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఆడిన రాహుల్ చాహర్ ధారాళంగా పరుగులిచ్చేశారు. దాంతో.. ఈరోజు మ్యాచ్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చక్రవర్తి మెరుగైన ప్రదర్శన కనబరిస్తే..? పాక్‌తో మ్యాచ్‌లోనూ అతనికి ఛాన్స్ దక్కనుంది. న్యూజిలాండ్‌తో గత సోమవారం జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచి మంచి టచ్‌లో కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.