యాప్నగరం

సరదా నుంచి ‘ఛాంపియన్’ స్థాయికి శ్రీకాంత్

కుర్రాడిలో ఇసుమంతైనా లేకపోగా.. అకాడమీలో సరదాగా జోక్‌లు వేస్తూ సమయం వృథా చేసేవాడు. ఎందుకిలా అని పరిశీలిస్తే..

TNN 27 Jun 2017, 5:08 pm
ఆ కుర్రాడు సరదాగా గుంటూరులో తన అన్నతో కలిసి బ్యాడ్మింటన్ నేర్చుకున్నాడు. కొద్దిరోజులకి అన్న.. శిక్షణ కోసం గోపిచంద్ అకాడమీలో చేరిపోవడంతో ఇక ఆ ఆట గురించే మరిచిపోయాడు. కానీ.. ఆ కుర్రాడి తల్లిదండ్రులు మాత్రం అతని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. అయినా.. వింటేనా..? ఇంటి దగ్గర ఖాళీగా ఫ్రెండ్స్‌తో బలాదూర్ తిరుగుతుండటంతో విసిగిపోయిన అతని తండ్రి బలవంతంగా తీసుకెళ్లి గోపిచంద్ అకాడమీలో చేర్పించాడు.
Samayam Telugu how pullela gopichand turned a playful kidambi srikanth into a mean machine
సరదా నుంచి ‘ఛాంపియన్’ స్థాయికి శ్రీకాంత్


కానీ.. ఆట నేర్చుకోవాలనే పట్టుదల, విజయ కాంక్ష ఆ కుర్రాడిలో ఇసుమంతైనా లేకపోగా.. అకాడమీలో సరదాగా జోక్‌లు వేస్తూ సమయం వృథా చేసేవాడు. ఎందుకిలా అని పరిశీలిస్తే.. తన అన్నతో కలిసి ఉండొచ్చనే భావనతోనే అతను అకాడమీలో చేరినట్లు కోచ్ గుర్తించాడు. సింగిల్స్ కంటే డబుల్స్ ఎక్కువ ఆడేందుకు ప్రాధాన్యమిచ్చే ఆ కుర్రాడు కామన్‌వెల్త్ జూనియర్స్ పోటీల్లో డబుల్స్ విభాగంలో మెడల్ గెలవడంతో ఇక సింగిల్స్‌ ఆడటం తగ్గించేశాడు. కానీ.. అతను ఆడే షాట్లలో అమితమైన ప్రతిభ దాగుందని గుర్తించిన కోచ్.. ‘నువ్వు సింగిల్స్ మాత్రమే ఆడాలి’ అని నియమం పెట్టి మరీ సింగిల్స్‌పై కఠినమైన శిక్షణ ఇవ్వడం మొదలెట్టాడు. ఆ కుర్రాడే ఇప్పుడు బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సంచలన విజయాలకి మారుపేరుగా నిలిచి.. భారత్‌కి వరుస టైటిల్స్‌ని అందిస్తున్న కిదాంబి శ్రీకాంత్. తాజాగా ఆస్ట్రేలియాలో ఓపెన్ సిరీస్‌ నెగ్గిన అనంతం తన శిష్యుడు శ్రీకాంత్ గురించి కోచ్ పి. గోపీచంద్ గుర్తు చేసుకున్నారు.

‘శ్రీకాంత్ అతని అన్న నందగోపాల్ చేరిన కొద్ది రోజులకి అకాడమీకి వచ్చాడు. అతడ్ని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చిన అతని తండ్రి... శ్రీకాంత్ ఇంటి దగ్గర ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడని అకాడమీలో చేర్చుకోవాల్సిందిగా కోరారు. చేరిన కొత్తలో అతనికి అసలు ఆట మీద శ్రద్ధ ఉన్నట్లు నాకు కనిపించలేదు. అందరితో జోక్‌లు వేసుకుంటూ గడిపేసేవాడు. నందగోపాల్‌తో ఉండొచ్చనే కారణంతో అతను చేరినట్లు నేను గుర్తించాను. శ్రీకాంత్ కచ్చితంగా ప్రతిభ ఉన్న ఆటగాడే. కొన్ని స్మాష్‌ షాట్లు మేము నేర్పించకుండానే అతను ఆడేసేవాడు. అందుకే అతడ్ని కేవలం సింగిల్స్‌ మాత్రమే ఆడాలని నియమం పెట్టి మరింత తర్ఫీదు ఇచ్చాను’ అని గోపీచంద్ గుర్తు చేసుకున్నారు.

శిక్షణ కొనసాగేకొద్దీ శ్రీకాంత్‌లో క్రమశిక్షణ అలవడిందని.. ఇప్పుడు కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని కోచ్ ధీమా వ్యక్తం చేశారు. ‘శ్రీకాంత్ చాలా మంచి వ్యక్తి. నా శిక్షణని తు.చ తప్పకుండా పాటిస్తాడు. నిజానికి అతని తల్లిదండ్రులు కూడా నాపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉంచారు’ అని గోపిచంద్ ఆనందం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.