యాప్నగరం

2023లో ఐఓసీ సదస్సు నిర్వహిస్తాం.. అవకాశం ఇవ్వండి: భారత్!

రాబోయే ఏళ్లలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది లక్ష్యంగా పెట్టుకున్న భారత ఒలింపిక్ సంఘం తన కార్యాచరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా కీలకమైన ఐఓసీ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది.

Samayam Telugu 26 Jun 2019, 10:49 am
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 2023 సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు భారత్ బిడ్ దాఖలు చేసింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం మంగళవారం బిడ్ సమర్పించింది. స్విట్జర్లాండ్‌లోని లూసెన్సేలో జరుగుతోన్న ఐఓసీ 134వ గవర్నింగ్ బాడీ సమావేశంలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరేంద్ర బాత్రా, సభ్యురాలు నీతా అంబానీలు ఈ ప్రతిపాదనలను అందజేశారు. ముంబై వేదికగా నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఐఓసీ చీఫ్ థామస్ బ్యాక్‌కు అందించారు. ఈ సమావేశంలో 2030లో జరిగే వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశాన్ని ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఐఓసీ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ ముందుకొచ్చింది. ఐఓఏ అధ్యక్షుడు బాత్రా మాట్లాడుతూ.. 2022- 2023 ఏడాదికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని, ఈ సందర్భంగా భారతీయ క్రీడారంగం తరఫున వేడుకలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఒలింపిక్ కమిటీ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిపారు.
Samayam Telugu ioc


లూసెన్సా సమావేశంలోనే బుధవారం కొత్త సభ్యుడిని ఐఓసీ ఎన్నుకోనుందని ఆయన తెలియజేశారు. గతంలోనే ఐఓసీ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వాలని భారత్ ప్రయత్నించింది. అయితే, ఇటలీ కూడా ఇందుకు పోటీలో ఉంటామని తెలిపింది. అయితే, 2026 వింటర్ ఒలింపిక్స్‌ నిర్వహణకు బిడ్ వేయాలని నిర్ణయించుకున్న ఇటనీ, ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ఐఓసీ నిబంధనల ప్రకారం.. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశం ఐఓసీ సమావేశాన్ని నిర్వహించడానికి అర్హత ఉండదు. 2026 వింటర్ ఒలింపిక్ క్రీడలు ఇటలీ నగరం మిలాన్‌లో నిర్వహించనున్నట్టు సోమవారం ప్రకటించారు. గతంలో 1983 ఐఓసీ సదస్సుకు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇచ్చింది. తాజా సమావేశాన్ని ముంబైలో నిర్వహించాలని కోరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.