యాప్నగరం

వోహ్రా..సన్‌రైజర్స్‌ని కంగారు పెట్టావు కదయ్యా..!

అప్పటి వరకు ఏక పక్షంగా సాగుతున్న మ్యాచ్‌ వోహ్రా దూకుడుతో ఆసక్తికరంగా మారింది. స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్‌లో వోహ్రా బౌండరీలతో రెచ్చిపోయాడు

TNN 18 Apr 2017, 10:03 am
ఐపీఎల్ పదో సీజన్‌లో భారత యువ క్రికెటర్లు సత్తా చాటుతూ వెలుగులోకి వస్తున్నారు. ఇటీవల దిల్లీ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ శతకం బాది అందర్నీ ఆశ్చర్యపరచగా.. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ మనన్ వోహ్రా (95: 50 బంతుల్లో 9x4, 5x6) ఔరా అనిపించాడు. 160 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ జట్టు ఆదిలోనే వరుసగా వికెట్లు చేజార్చుకుని ఒకానొక దశలో 82/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో సహనంతో ఆడిన వోహ్రా.. టెయిలెండర్లతో కలిసి ఒంటరిగా పోరాడుతూ మ్యాచ్‌ను దాదాపు పంజాబ్ చేతుల్లోకి తెచ్చేశాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ నుంచి బాదుడు మొదలెట్టిన వోహ్రా.. ఆ ఓవర్ వేసిన బరిందర్ శరణ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతనితో పాటు మోహిత్ శర్మ కూడా ఓ సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్‌లో పంజాబ్ 25 పరుగులు పిండుకుంది.
Samayam Telugu srh vs kxip turning point manan vohras dismissal
వోహ్రా..సన్‌రైజర్స్‌ని కంగారు పెట్టావు కదయ్యా..!


అప్పటి వరకు ఏక పక్షంగా సాగుతున్న మ్యాచ్‌ వోహ్రా దూకుడుతో ఆసక్తికరంగా మారింది. స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్‌లో వోహ్రా బౌండరీలతో రెచ్చిపోయాడు. రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాది 23 పరుగులు రాబట్టాడు. దీంతో మ్యాచ్‌ ఒక్కసారిగా మలుపు తిరిగి పంజాబ్ శిబిరంలో ఆనందం వెల్లువిరిసింది. కానీ.. 17వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ తెలివైన బంతితో మోహిత్ శర్మని ఔట్ చేసి.. ఆ ఓవర్‌లో 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో పంజాబ్‌పై మళ్లీ ఒత్తిడి పెరిగింది. ఈ దశలో 18వ ఓవర్ వేసిన కౌల్ బౌలింగ్‌లో వోహ్రా మళ్లీ సిక్స్ కొట్టి వూపు మీదకి వచ్చినా.. ఆ ఓవర్‌లో చాలా బంతుల్ని కరియప్ప వృథా చేశాడు. అయినప్పటికీ వోహ్రా క్రీజులో ఉండటంతో పంజాబ్ గెలుపుపై ఆశతోనే ఉంది. కానీ.. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ మ్యాచ్‌ని పూర్తిగా మలుపు తిప్పశాడు. ఆ ఓవర్ తొలి బంతికే కరియప్పను ఔట్ చేసిన భువీ.. మూడో బంతికి వోహ్రాని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. చివరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా... 5 పరుగులు మాత్రమే ఇచ్చిన కౌల్ నాలుగో బంతికి ఇషాంత్‌ని క్లీన్‌బౌల్డ్ చేసి సన్‌రైజర్స్‌ని సంబరాల్లో ముంచెత్తాడు. మ్యా‌చ్‌లో పంజాబ్ ఓడినా.. వోహ్రా మాత్రం ఒంటరి పోరాటంతో అందరి మనసులు గెలిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.