యాప్నగరం

జనవరి 4 తర్వాత ఆ ఫోన్‌లన్నీ పని చేయవు.. శకం ముగిసినట్టే.. పూర్తి వివరాలివే - Blackberry devices to die on January 4

మొబైల్ ప్రపంచంలో ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించిన బ్లాక్‌‌బెర్రీ ఫోన్‌లు తుది అంకానికి చేరుకున్నాయి. జనవరి 4 నుంచి ఇక పని చేయవు. పూర్తి వివరాలివే..

Samayam Telugu 2 Jan 2022, 2:28 pm
టెక్నాలజీ చరిత్రలో ఓ శకం ముగియనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బ్లాక్‌బెర్రీ (Blackberry) డివైజ్‌లకు ఇక గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఒకవేళ ఇప్పటికీ ఎవరైనా బ్లాక్‌బెర్రీ ఓఎస్ ఫోన్‌లు వాడుతుంటే.. జనవరి 4 తర్వాత ఇక అవి పని చేయవు. ఇది నిజం. ఇక బ్లాక్‌బెర్రీ డివైజ్‌ల నుంచి ఫోన్ కాల్స్ చేయలేరు.. అలాగే డేటా ఉపయోగించలేరు.. అలాగే ఎస్ఎంఎస్‌లు ఉండవు. అంటే మొత్తంగా బ్లాక్‌బెర్రీ 10 అంతకంటే పాత ఆపరేటింగ్ ఓఎస్ ఉన్న ఫోన్‌లు, ట్యాబ్లెట్లలో ముఖ్యమైన సర్వీసులన్నీ నిలిచిపోనున్నాయి.
Samayam Telugu బ్లాక్‌బెర్రీ
Blackberry phones


బ్లాక్‌బెర్రీ 10.0 ఓఎస్ దాని కంటే తక్కువ వెర్షన్‌లపై నడుస్తున్న మొబైళ్లు.. బ్లాక్‌బెర్రీ ఓఎస్‌పై రన్ అవుతున్న ట్యాబ్లెట్లకు సేవలు నిలిచిపోనున్నాయి. వీటిలో ఫోన్ కాల్స్, టెక్స్ట్, ఇంటర్నెట్ సర్వీసులు జనవరి 4వ తేదీ తర్వాత పని చేయవని సంస్థ ప్రకటించింది.
స్మార్ట్‌ఫోన్ విభాగంలో చాలా కాలం పాటు బ్లా‌క్‌బెర్రీ ఆధిపత్యం చెలాయించింది. ప్రపంచం మొత్తం ఈ ట్రెండ్ చాలా కాలం పాటు నడిచింది. ప్రత్యేకమైన కీబోర్డు, మంచి సెక్యూరిటీ ఫీచర్లు ఇలా అనేక స్పెషాలిటీలతో ఎంతో మంది వినియోగదారులను సంపాదించుకుంది.

ఆ తర్వాత యాపిల్ ఐఫోన్‌లు రావడంతో బ్లాక్‌బెర్రీ క్రేజ్ క్రమంగా పడిపోయింది. ఫోన్‌లలో ఫిజికల్ కీబోర్డులపై ప్రజల్లో మక్కువ తగ్గింది. టచ్ స్క్రీన్ ఫోన్‌లకు డిమాండ్ పెరిగింది. అయినా ట్రెండ్‌కు తగ్గట్టు ముందుకు సాగేందుకు బ్లాక్‌బెర్రీ ప్రయత్నించింది. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో మళ్లీ ఆధిపత్యం చెలాయించలేకపోయింది. దీంతో బ్లాక్‌‌బెర్రీ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది.
బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న డివైజ్‌లన్నింటికీ మరో రెండు సంవత్సరాల పాటు సేవలు అందిస్తామని బ్లాక్‌బెర్రీ 2017లో ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆ సమయం ముగిసిపోవడంతో బ్లాక్‌బెర్రీ ఓఎస్‌పై నడిచే డివై‌జ్‌ల్లో కీలకమైన సర్వీసులు పని చేయవని ఆ సంస్థ తన బ్లాగ్‌లో పేర్కొంది.

అయితే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తున్న బ్లాక్‌బెర్రీ డివైజ్‌లపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఆండ్రాయిడ్ ఓఎస్‌పై నడిచే ఫోన్‌లు యథావిధిగా వని చేయనున్నాయి. కాల్స్, ఎస్ఎంఎస్, డేటా సహా అన్నీ సర్వీసులు ఈ మొబైళ్లలో నడుస్తాయి. బ్లాక్‌బెర్రీ పేరుతో ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లను టీసీఎల్ ఉత్పత్తి చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.