యాప్నగరం

Chinese Mobiles : షావోమీ, రియల్‌మీతో పాటు అన్ని చైనీస్ మొబైల్‌ కంపెనీలకు భారీ షాక్ తప్పదా? ఇదే జరిగితే..

Chinese Smartphones : ఇండియాలో చైనా సంస్థలకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ నిబంధన వస్తే షావోమీ, రియల్‌మీ, వివో, ఒప్పో, ఇన్ఫినిక్స్, టెక్నోతో పాటు చాలా కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ తగులుతుంది. పూర్తి వివరాలు ఇవే.

Authored byKrishna Prakash | Samayam Telugu 11 Aug 2022, 8:35 am
భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థలదే ఆధిపత్యంగా ఉంది. అత్యధిక వాటాతో షావోమీ (Xiaomi) అగ్రస్థానంలో ఉంటే.. వేగంగా వృద్ధి చెందుతూ రియల్‌మీ (Realme) దూసుకుపోతోంది. ఈ రెండింటితో పాటు వివో (Vivo), ఒప్పో (Oppo), ఇన్ఫినిక్స్ (Infinix), టెక్నో (Tecno) కూడాా భారీగా సేల్స్ చేస్తున్నాయి. ఇలా చైనీస్ సంస్థలే ఇండియా మొబైల్‌ మార్కెట్‌లో అత్యధిక షేర్‌ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో చైనీస్ సంస్థలకు షాక్ ఇచ్చేలా భారత ప్రభుత్వం ఓ నిబంధన తీసుకురానుందనే సమాచారం లీకైంది. ఒకవేళ ఇదే జరిగితే ఈ చైనీస్ సంస్థలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. మొత్తంగా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్ ముఖచిత్రం మారుతుంది. భారత ప్రభుత్వం ఆలోచిస్తున్న ఈ కొత్త నిబంధన ఏంటి.. అది అమలైతే చైనీస్ సంస్థలకు ఎంత ఎదురుదెబ్బగా మారనుందో పూర్తి వివరాలు చూడండి.
Samayam Telugu India May ban on Chinese Mobiles under 12000


రూ.12,000వేలలోపు ధరలో స్మార్ట్‌ఫోన్‌లను చైనీస్ సంస్థలు… ఇండియాలో అమ్మకూడదనే నిబంధన తీసుకురావాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు బ్లూమ్‍‌బర్గ్ (Bloomberg) కథనం వెల్లడించింది. అంటే బడ్జెట్ రేంజ్‌లో చైనీస్ సంస్థలు.. భారత్‌లో మొబైళ్లు అమ్మకుండా మన సర్కార్ నిషేధించే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం రూ.12వేలలోపే అత్యధికంగా మొబైళ్లు అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన షావోమీ, రియల్‌మీ, ఇన్ఫినిక్స్‌తో పాటు వివో, ఒప్పో, టెక్నోల నుంచి కూడా రూ.12వేల రేంజ్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. క్రమంగా విడుదలవుతుంటాయి. ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో రూ.12వేల ధరలోపు మొబైళ్లలో షావోమీ, రియల్‌మీ వాటా 50శాతానికిపైగా ఉంది.
“మొత్తంగా ఇండియా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఈ ఏడాది జూన్ ముగిసే నాటికి 150డాలర్ల (రూ.12వేల) రేంజ్‌ మొబైళ్ల వాటా 31 శాతంగా ఉంది. 75 నుంచి 80 శాతం వాల్యూమ్స్ వరకు చైనీస్ బ్రాండ్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. షావోమీ, రియల్‌మీ 50 శాతం వాటాను సాధిస్తున్నాయి” అని రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ చెప్పారు.

ప్రభుత్వం ఎందుకు ఈ ఆలోచన చేస్తోంది..?
రూ.12వేలలోపు రేంజ్‌లో చైనీస్ స్మార్ట్‌ఫోన్‌లను నిషేధించాలని భారత ప్రభుత్వం ఎందుకు యోచిస్తుందో కూడా బ్లూమ్‌బర్గ్ కథనం వెల్లడించింది. మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్‌తో పాటు ఇతర భారతీయ సంస్థలకు ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశం ఉందని కూడా పేర్కొంది.
మరి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ రూ.12వేలలోపు మొబైళ్లను భారత్‌లో విక్రయించకుండా చైనాకు చెందిన సంస్థలను నిరోధిస్తే భారీ మార్పు వచ్చే అవకాశం ఉంది. చైనా సంస్థలు రూ.వేలకోట్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇది డ్రాగన్ దేశానికి భారీ షాక్‌గా మారొచ్చు. ఇప్పటికే వందలాది చైనా యాప్స్‌ను భారత్‌ బ్యాన్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.