యాప్నగరం

Smartphone Sales : భారీగా పడిపోయిన స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు - దశాబ్దంలో రెండోసారి ఆ మార్క్ కంటే తక్కువగా - కారణాలు ఏంటంటే..

Global Smartphone Sales : గ్లోబల్‌గా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ సంవత్సరం మేలో మొబైళ్ల సేల్స్ గణనీయంగా పడిపోయాయి. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ఈ గణాంకాలను వెల్లడించింది.

Authored byKrishna Prakash | Samayam Telugu 4 Jul 2022, 12:04 pm
Smartphones Sale Down Globally : ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ల సేల్స్ భారీగా పడిపోయాయి. ఈ ఏడాది మేలో మొబైల్స్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ విషయాన్ని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ (Counterpoint Research) వెల్లడించింది. మే నెలలో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ సేల్స్ (Mobile Sales) కనీసం 10 కోట్ల మార్క్‌ను కూడా చేరుకోలేదట. ఒక నెలలో గ్లోబల్‌గా 10 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుకాకపోవడం పదేళ్లలో ఇదే రెండోసారి అని ఆ నివేదిక పేర్కొంది. ఏప్రిల్‌ నెలతో పోలిస్తే మేలో ఏకంగా ఫోన్ల అమ్మకాలు 4 శాతం పడిపోయాయి. అదే 2021 మేతో పోలిస్తే ఈ సంవత్సరం మేలో 10శాతం క్షీణత కనిపించింది. మరోవైపు క్రమంగా ప్రతీ నెలా సేల్స్ పడిపోతూ వస్తుండగా.. మేలో ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.
Samayam Telugu Smartphone Sales in May


కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం ఈ సంవత్సరం మేలో ప్రపంచవ్యాప్తంగా 9.60 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు అమ్మడయ్యాయి. అంతకు ముందు నెలతో పోలిస్తే 4శాతం, గత సంవత్సరం మేతో పోలిస్తే 10 శాతం సేల్స్‌లో క్షీణత ఉందని పేర్కొంది. అంతకు ముందు నెల కంటే తక్కువ సేల్స్ జరగడం వరుసగా ఇది 11వ సారి అని తెలిపింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గాక సేల్స్ కాస్త పెరిగినా.. మళ్లీ తగ్గుదల కనిపిస్తోందని వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొవిడ్-19 ముందు నాటి పరిస్థితి ఇంకా నెలకొనడం లేదని చెప్పింది. ఇందుకు కొన్ని కారణాలను చెప్పింది.

  • ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ తగ్గుతోందని ఈ నివేదిక పేర్కొంది. ఎక్కువ మంది మొబైళ్లు కొనేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిపింది.
  • చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం కూడా ఓ కారణంగా ఉటంకించింది.
  • రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా మొబైల్ సేల్స్‌పై తీవ్రమైన ప్రభావం చూపించిందని తెలిపింది.
  • చైనాలో కరోనా వైరస్ ప్రభావం వల్ల రవాణా సమస్యలు తలెత్తడం కూడా మరో కారణంగా ఉంది. దీంతో మొబైల్ తయారీ సంస్థలకు షిప్‌మెంట్ సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఉత్పత్తిని తగ్గించేస్తున్నాయి.
  • చిప్‌ల కొరత కూడా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతోందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది.
ఈ సంవత్సరం రెండో అర్ధభాగంలో పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అంచనా వేసింది. డిమాండ్ పెరిగి, స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తిని కంపెనీలు పెంచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే చైనా ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరే అవకాశం ఉందని, టెక్నాలజీ సప్లై చైన్ మెరుగుపడుతుందని అంచనా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.