యాప్నగరం

సీఎం కేసీఆర్‌ అమెరికా అధ్యకుడిని కలసినా బీజేపీ భయపడబోదు.. ఆయన్ను ప్రజలు నమ్మట్లేదు: కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తానంటూ కేసీఆర్‌ ప్రకటనలు చేశారని.. అవన్నీ ప్రగతి భవన్‌కే పరిమితం అయ్యాయని సెటైర్లు వేశారు.

Authored byRaj Kumar | Samayam Telugu 23 May 2022, 9:11 am

ప్రధానాంశాలు:

  • సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
  • కేసీఆర్‌ను ఇక్కడి ప్రజలు నమ్మడం లేదు..
  • అందుకే ఢిల్లీ, పంజాబ్ వెళ్లారని సెటైర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కిషన్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ను ఇక్కడి ప్రజలు నమ్మడం లేదని.. అందుకే ఢిల్లీ, పంజాబ్‌ వెళ్లారని విమర్శించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు దిక్కులేదని.. పంజాబ్‌ రైతులను ఆదుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇంతకు ముందు కూడా ఎన్నో సందర్భాల్లో దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తానంటూ కేసీఆర్‌ ప్రకటనలు చేశారని.. అవన్నీ ప్రగతి భవన్‌కే పరిమితం అయ్యాయని విమర్శించారు.
ఆదివారం ఆయన హైదరాబాద్‌ నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ స్కూల్‌లో అటల్‌ బిహారీ వాజపేయి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్కిల్‌ డెవల్‌పమెంట్‌ శిక్షణ, సర్టిఫికెట్ల పంపిణీ’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ అమెరికా, పాక్‌ అధ్యక్షులను కలిసినా.. బీజేపీ భయపడేది లేదని కిషన్ రెడ్డి అన్నారు. ‘మీరెన్ని కుట్రలు చేసినా.. మోదీపై ఎంత విషప్రచారం చేసినా.. ప్రజలు నమ్మబోరు. రాష్ట్ర ప్రజల నుంచి కేసీఆర్‌ కుటుంబానికి చీదరింపులు తప్పవు’ అంటూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లడం వల్లే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించారనడం సిగ్గుచేటని చెప్పుకొచ్చారు.

ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించిందని, దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు వసూలు చేస్తోందని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. నూతన విద్యావిధానంపై కేసీఆర్‌ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. పేదల కోసమే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. దానిపై కేసీఆర్‌కు కనీస అవగాహన కూడా లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామన్న వాగ్దానం ఏమైందని ఆయన కేసీఆర్‌ను ప్రశ్నించారు.


కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా యోగా డేను నిర్వహించేందుకు సాధ్యపడలేదని.. జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 27న ఎల్‌బీ స్టేడియంలో 25 రోజుల యోగా డే కౌంట్‌డౌన్‌ ప్రారంభమవుతుందన్నారు. యోగా దినోత్సవాన్ని ట్యాంక్‌బండ్‌పై ఘనంగా నిర్వహిస్తామని, ఇద్దరు కేంద్ర మంత్రులు ఆ కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు. కేశవ మెమోరియల్‌ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని విప్లవ గాయకుడు గద్దర్‌ కలిశారు. తాను పాడిన పాటలపై పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులను ఎత్తేయాలంటూ కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖ గురించి ఆయన ప్రస్తావించినట్లు తెలిసింది. ఆ లేఖను అమిత్‌షా పరిశీలించారో లేదోనన్న గద్దర్‌.. దానిపై ఆయనతో చర్చించాలని కిషన్‌రెడ్డిని కోరారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.