యాప్నగరం

‘దిశ’ స్కూటీలో గాలి తీసింది అతడు కాదు.. సజ్జనార్ స్టేట్‌మెంట్ తప్పు: శంషాబాద్ డీసీపీ

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో శంషాబాద్ డీసీపీ సిర్పుర్కర్‌ కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఆ సమయంలో తాను చెప్పిన విషయాలను సీపీ సజ్జనార్ తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.

Samayam Telugu 21 Oct 2021, 9:29 am

ప్రధానాంశాలు:

  • ‘దిశ’ స్కూటీ టైర్‌లో గాలి తీసింది నవీన్‌ అని చెప్పలేదు
  • నిందితుల డీఎన్‌ఏ సేకరణ, దిశ వస్తువుల రికవరీ జరిగిందని కూడా చెప్పలేదు
  • జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ముందు శంషాబాద్‌ డీసీపీ వాంగ్మూలం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి(ఫైల్ ఫోటో)
‘దిశ’ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ బుధవారం విచారణ కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే శంషాబాద్‌ డీసీపీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి కమిషన్ ఎదుట హాజరై పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ ఎన్‌కౌంటర్‌ సమయంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను చాలా ప్రశ్నలకు ‘శంషాబాద్‌ డీసీపీ బ్రీఫింగ్‌ చేసేవారు.. దాన్ని బట్టే మీడియాకు వివరాలను వెల్లడించాను’ అని అని చెప్పిన నేపథ్యంలో కమిషన్‌ తరుఫున న్యాయవాది ఎం.విరూపాక్ష దత్తాత్రేయ గౌడ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ కేసుకు సంబంధించి తాను చెప్పిన చాలా విషయాలను సజ్జనార్ తప్పుగా అర్థం చేసుకుని మీడియాకు వెల్లడించారని ఆయన పేర్కొన్నారు.
‘దిశ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) మహ్మద్‌ ఆరిఫ్‌ కన్ఫెషన్‌ స్టేట్‌మెంట్‌ 2019 నవంబర్‌ 29న సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమై 6:45 గంటలకు ముగిసింది. ఏ2– జొల్లు శివ విచారణ 6:45 గంటలకు ప్రారంభించి ఎన్ని గంటలకు ముగించారో రికార్డ్‌ చేయలేదు. ఆరిఫ్‌ వాంగ్మూలం పూర్తికాకుండానే గంట ముందే అప్పటి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌కు నిందితులు నేరం చేసిన తీరును ఎలా చెప్పగలిగారు’ అని డీసీపీని కమిషన్‌ ప్రశ్నించింది. అయితే సాయంత్రం 5:15 గంటలకు నిందితుల అరెస్టు గురించి మాత్రమే ఏసీపీ సురేందర్‌ తనకి చెప్పగా.., అదే విషయాన్ని సజ్జనార్‌కు తాను వివరించానని డీసీపీ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు.

2019 డిసెంబర్‌ 6వ తేదీ నాటికి దిశ సెల్‌ఫోన్, పవర్‌ బ్యాంక్‌ల రివకరీ, నిందితుల డీఎన్‌ఏ సేకరణ జరగలేదని డీసీపీ తెలిపారు. కానీ అదే రోజు రాత్రి 7:15 గంటలకు శంషాబాద్‌ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సజ్జనార్‌ రికవరీ, డీఎన్‌ఏ సేకరణ జరిగినట్లు తప్పుగా చెప్పారని తెలిపారు. నిందితులు మరణించాకే వారి మృతదేహాల నుంచి డీఎన్‌ఏ శాంపిల్స్‌ను సేకరించామని పేర్కొన్నారు. ‘దిశ’ స్కూటీ టైర్‌లో గాలి తీసింది జొల్లు నవీన్‌ అని తాను చెప్పలేదని సిర్పుర్కర్‌ కమిషన్‌కు శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. 2019 నవంబర్‌ 29న రాత్రి 7:15 గంటలకు శంషాబాద్‌ డీసీపీ ఆఫీసులో ప్రెస్‌మీట్‌ నిర్వహించే టైమ్‌కి జొల్లు నవీన్‌ ఒప్పుకోలు విచారణ జరగలేదని, కానీ సజ్జనార్ మాత్రం నవీనే గాలి తీశాడని ఎలా చెప్పారని కమిషన్ ప్రశ్నించగా.. తాను సజ్జనార్‌కు దాని గురించి చెప్పలేదని, నలుగురు నిందితులు కలిసే దిశ స్కూటీని పంక్చర్‌ చేసే పథకం రచించారని మాత్రమే చెప్పానని డీసీపీ తెలిపారు.

ఈ కేసులో నిందితుల కస్టడీ కోసం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోకపోవడంపై డీసీపీపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘లా అండ్‌ ఆర్డర్‌లో డీసీపీ హోదాలో ఉంటూ, శంషాబాద్‌ వంటి కీలకమైన ప్రాంతానికి ఉన్నతాధికారి అయి ఉండి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో క్రిమినల్‌ ప్రొసిజర్స్‌ కోడ్స్‌ను సరిగా అనుసరించాలని తెలియదా’ అని జస్టిస్‌ వీఎస్‌ సిర్పుర్కర్‌ మండిపడ్డారు. నిందితులను కస్టడీకి తీసుకునేముందు భౌతికంగా జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చడం, నిందితుల ఆరోగ్య పరిస్థితులు, ఇతరత్రా వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని మీకు తెలియదా? అని మందలించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా దాటవేస్తున్నారంటూ డీసీపీపై అసహనం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.