యాప్నగరం

నవజాత శిశువుల అత్యవసర చికిత్సకు సరికొత్త విధానం.. ఇక ఎక్కడిక్కడే వైద్య సేవలు

Niloufer: చిన్నపిల్లలకు అత్యవసర చికిత్స కోసం నిలోఫర్ ఆసుపత్రికి తరలించకుండా ఇక ఎక్కడికక్కడే జిల్లాల్లోనే వైద్య చికిత్సలు అందించనున్నారు. ఆన్‌లైన్ విధానం ద్వారా నిలోఫర్ వైద్యలు బృందం జిల్లాల్లోని చిన్నారులకు చికిత్సకు సంబంధించిన సలహాలు సూచనలు అందించనున్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 2 May 2023, 9:12 am

ప్రధానాంశాలు:

  • చిన్నారులకు ఇక సత్వర వైద్యం
  • జిల్లాల్లోనే నిలోఫర్ తరహా వైద్య సేవలు
  • ఆన్‌లైన్‌లో సలహాలు ఇవ్వనున్న నిలోఫర్ వైద్యులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Niloufer
నిలోఫర్
Special Newborn Care Units: చిన్న పిల్లల వైద్యానికి హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రి పెట్టింది పేరు. నగరంతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి చిన్నపిల్లలను ఇక్కడకు తీసుకొచ్చి వైద్యం చేయిస్తారు. రాష్ట్రంలో ఏ పసిపాపకు ఆరోగ్యం ప్రమాదకరంగా మారినా వెంటనే జిల్లాల్లోని డాక్టర్లు నిలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేస్తారు. అంతలా ప్రాచుర్యం పొందింది నిలోఫర్ ఆసుపత్రి. అయితే కొన్ని సార్లు జిల్లాల నుంచి చిన్నపిల్లను ఆసుపత్రికి తరలించే క్రమంలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి ఆసుపత్రికి చేరుకొని లోపే నవజాత శిశువులు మృత్యువాతపడిన ఘటనలు అనేకం. ఇక నుంచి అలాంటి జరగవు. ఎందుకంటే ఇక నిలోఫర్‌లో అందించే చికిత్సలు ఇప్పుడు జిల్లాల్లోనే ఎక్కడిక్కడ అందించనున్నారు.
అందుకు నిలోఫర్ ఆసుపత్రి పూర్తిస్థాయిలో భరోసా ఇవ్వనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లోని స్పెషల్‌ న్యూబోర్న్‌ కేర్‌ యూనిట్ల (SNCU)ను నిలోఫర్‌తో ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయనున్నారు. దీంతో హైదరాబాద్ నుంచే నిలోఫర్ వైద్య నిపుణులు ఆన్‌లైన్‌లో పిల్లల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు. దీని ద్వారా గ్రామీణ, జిల్లా స్థాయుల్లో నవజాత శిశువులకు నాణ్యమైన సేవలు అందటంతో పాటు మరణాలను తగ్గించేందుకు దోహదపడనున్నాయి. కొందరు నవజాత శిశువుల్లో పుట్టుకతోనే రకరకాల వ్యాధులు బయటపడుతుంటాయి. నెలలు నిండక ముందే, అతి తక్కువ బరువుతో పిల్లలు జన్మిస్తుంటారు. ఇలాంటి వారందరినీ కొద్ది రోజులు ఎస్‌ఎన్‌సీయూలో ఉంచి డాక్టర్లు పర్యవేక్షిస్తారు.

ఈ విభాగాలు 2014కు ముందు తెలంగాణ వ్యాప్తంగా 15 వరకు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 44కు చేరింది. ఒక్క నిలోఫర్‌లోనే ఎస్‌ఎన్‌సీయూ పడకలు వంద వరకు ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది చిన్నారులను నిలోఫర్ తీసుకొచ్చి చికిత్స అందిస్తుంటారు. ఇక నుంచి అలా జరగకుండా ఎక్కడికక్కడ మంచి సేవలు అందించొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. నిలోఫర్‌ నుంచి రోజూ ఇద్దరు లేదా ముగ్గురు నవజాత శిశువుల వైద్య నిపుణులు ఆన్‌లైన్‌ ద్వారా అన్ని కేంద్రాల్లోని పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. వారికి అవసరమైన చికిత్సలను ఆన్‌లైన్ ద్వారానే స్థానిక డాక్టర్లకు సూచిస్తారు. ఈ సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. జిల్లాల్లో పరిస్థితి మెరుగుపడకపోతే శిశువులను హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే మారుమూల ప్రాంతాల నుంచి నవ జాత శిశువులను హైదరాబాద్ తరలించకుండా ఎక్కడిక్కడే వైద్య సేవలు అందనున్నాయి.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.