యాప్నగరం

రేవంత్‌పై చంద్రబాబుకి ఫిర్యాదు చేశా.. మంత్రి మల్లా రెడ్డి షాకింగ్ కామెంట్స్

మంత్రి మల్లా రెడ్డి వర్సెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. రేవంత్‌పై చంద్రబాబుకి కూడా ఫిర్యాదు చేశానని.. పార్ట్‌ - 2 ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Samayam Telugu 28 Aug 2021, 5:31 pm
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి మల్లా రెడ్డి వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. కొత్తగా ఈ వ్యవహారంలోకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లాక్కొచ్చారు మంత్రి మల్లా రెడ్డి. రేవంత్ బ్లాక్‌మెయిల్ వ్యవహారం ఇప్పటిది కాదని.. ఎప్పటి నుంచో జరుగుతోందంటూ మరో బాంబు పేల్చారు. ఏవో కొన్ని జిరాక్స్ కాపీలు తెచ్చి అవినీతి అంటే కుదరదని.. నిరూపించాలని మల్లా రెడ్డి అన్నారు. తన సవాల్‌కి రేవంత్ రెడ్డి పారిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
chandrababu


2014 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి సీటు రాలేదన్న ఆక్రోశంతో తనను అప్పటి నుంచి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని మంత్రి మల్లా రెడ్డి ఆరోపించారు. కాలేజీలు నడుపుకునే తనకి రాజకీయాలు తెలియవని.. ఏదైనా నేరుగా మాట్లాడడమే తనకు తెలుసని అన్నారు. మల్కాజ్‌గిరి సీటు తెచ్చుకుని గెలిచిన తర్వాత కూడా తనను బెదిరింపులకు గురిచేశాడని.. సమాచార హక్కు చట్టం ఉపయోగించి తన కాలేజీలు మూయిస్తానని బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపించారు. తన మెడికల్ కాలేజీలపై ఏకంగా ఎంసీఐకి ఫిర్యాదు చేశాడన్నారు.

తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యవహారం అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లానని మల్లా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంసీఐకి ఫిర్యాదు చేయడంతో మధ్యవర్తి ద్వారా మాట్లాడుకున్నట్లు చెప్పారు. ఆ రోజు ఏం జరిగిందో తనకి, రేవంత్‌కి తెలుసని.. అది త్వరలోనే బయటపెడతానని మల్లా రెడ్డి అన్నారు. పార్ట్‌ 2 లో బయటికి వస్తుందంటూ ట్విస్ట్ ఇచ్చారు. రేవంత్ నా సవాల్‌కి పారిపోయాడని.. దమ్ముంటే హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. దివాళా తీసిన పార్టీకి అధ్యక్షుడయ్యాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

పనిలో పనిగా రేవంత్‌ని అంటిపెట్టుకుని ఉంటున్న సీతక్కకి కూడా చురకలంటించారు మంత్రి మల్లా రెడ్డి. తనకు 600 ఎకరాల భూమి ఉందని తానే చెప్పానన్నారు. అందులో 400 ఎకరాలు విద్యాసంస్థల కిందే ఉందని.. అలాంటి భూములకు రైతు బంధు వర్తిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. సీతక్క మంచిదే కానీ.. రేవంత్ రెడ్డి మాటలు విని తప్పుడు విమర్శలు చేస్తోందంటూ మల్లా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.