యాప్నగరం

ఈటల బీజేపీలోకి వస్తే.. ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలనం

Hyderabad: వైద్య ఆరోగ్యశాఖకు కనీస నిధులను కూడా కేసీఆర్ మంజూరు చేయటం లేదని అర్వింద్ ఆరోపించారు. ఈటల, కేటీఆర్‌తో పాటు భూ ఆరోపణలు ఎదుర్కొంటోన్న టీఆర్ఎస్ నేతలపై విచారణ జరగాలని ఎంపీ డిమాండ్ చేశారు.

Samayam Telugu 1 May 2021, 9:32 pm
ఈటల రాజేందర్ వ్యవహారంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. ఒకవేళ ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తే చేర్చుకోవటం అనేది తమ పార్టీ నాయకత్వ పరిధిలోని అంశమని ఆయన స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వారిని బీజేపీ సమర్థించబోదని అర్వింద్ తేల్చి చెప్పారు. తెలంగాణ కేబినెట్‌లో పనిచేసే ఏకైక మంత్రి ఈటల రాజేందర్ అని అర్వింద్ కొనియాడారు. వైద్య ఆరోగ్యశాఖకు కనీస నిధులను కూడా కేసీఆర్ మంజూరు చేయటం లేదని ఆరోపించారు. ఈటల, కేటీఆర్‌తో పాటు భూ ఆరోపణలు ఎదుర్కొంటోన్న టీఆర్ఎస్ నేతలపై విచారణ జరగాలని ఎంపీ డిమాండ్ చేశారు.
Samayam Telugu ధర్మపురి అర్వింద్ (ఫైల్ ఫోటో)
Dharmapuri Arvind


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల్లో 77 మందిపై భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. కరోనాకు కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులపై మీడియాలో కథనాలు వస్తున్నాయని.. కానీ సీఎం కేసీఆర్ ఇప్పటిదాకా ఒక్క సమీక్ష కూడా చేయలేదని విమర్శించారు.

హైదరాబాద్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేయమంటే.. ఆరోగ్యశ్రీ ఉందని చెప్పి కేసీఆర్ చేతులు దులిపేసుకున్నారని బండి సంజయ్‌ తెలిపారు. కార్పొరేట్‌ ఆస్పత్రులంటేనే పేదలు గుండె ఆగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ శాఖలో ఎక్కువ డబ్బులుంటే.. కేసీఆర్‌ ఆ శాఖ తీసుకుంటారని ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడిన మిగిలిన మంత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కరోనా నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని కొట్టిపారేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.